ఎవరిది కులతత్వం ?
గత కొన్ని రోజులుగా ప్రవీణ్ కుమార్ IPS రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే వార్త సంచనలం సృష్టించింది. పైకి కనపడక పోయినా ఏంతో మంది ఆధిపత్య కుల రాజకీయ నాయకులకి గుండెల్లో దడ పుట్టిస్తుంది. ఇప్పటివరకు వాళ్ళు బహుజనులు అంటే కేవలం సీట్ల కోసం తమ చుట్టూ అడుక్కుంటూ తిరిగే వాళ్ళ గానే చూశారు అందులో ముఖ్యంగా దళితులూ అంటే తమ పార్టీలకి డప్పులు కొడుతూ, చెప్పులు మోస్తూ , వాళ్ళు గెలవడానికి నోర్లు బొంగురు పోయేలా పాటలు పాడుతూ , నినాదాలు ఇస్తూ , జెండాలు మోసే వారిగానే చూశారు. అంత చేసినా ఇప్పటి ప్రభుత్వం , ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటూనే ఉద్యమ కారులని ఎంతగా అణచివేస్తుందో చూస్తూనే ఉన్నాం , ఉద్యమాల పేరుతొ , అమాయకుల ప్రాణ త్యాగాల పై , శవాల గుట్టల మీద తమ ఆధిపత్య రాజకీయ చతురతతో అధికారాన్ని చేజిక్కించుకుని మళ్ళీ దొరల కాలం నాటి తెలంగాణ కి తీసుకొని పోయేది కూడా చూస్తున్నాం . ఇక్కడ చదువు , ఆరోగ్యం, ఉపాధి , ఆత్మ గౌరవం , అధికారం అనే మాటలకి తావే లేదు . కేవలం మీరు బిచ్చగాళ్ళు , మెము మీకొక నాలుగు ఎంగిలి మెతుకులు పడేసే దొరలం అనే పోకడే కనపడుతుంది , ఇప్పటిదాకా అన్ని పార్టీలలోనూ కనపడింది కూడా అదే . నిజానికి సగానికి పైగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు సరిగ్గా డిగ్రీ కూడా చేసిన వాళ్ళు గా కనపడట్లేదు , పెద్ద చదువులు అంటే వారికి తెలిసే అవకాశం లేదు . విద్య జ్ఞానం , విజ్ఞానాన్ని , చైతన్యాన్ని , సమాజాన్ని పురోగతికి తీసుకుపోయే దృక్పధాన్ని ఇవ్వాలి కానీ అవి వచ్చే అవకాశం ఇప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు , రాదు అందుకే మహనీయులు కాన్షిరాం ఒక కల కన్నారు , బహుజనులకు రాజ్యాధికారం అన్నారు అందులో మహిళ కి పట్టం కట్టబెట్టినారు , రాజ్యాధికారం బహుజనులకు అసాధ్యం కాదు అని ప్రయోగాత్మకంగా చేసి చూపించారు .
ఇపుడు జరుగుతుంది ఏమిటి ? ప్రవీణ్ కుమార్ పేరెత్తితే అయన గతం గురించి మాట్లాడుతున్నారు , ఇది ఖచ్చితంగా విత్తనం మొలకెత్తకుండా అణగదొక్కడమే . అవునూ మనం అందరి గత అనుభవాల గురించి ఇంత బాగా మాట్లాడామా ? సరే మాట్లాడుకుందాం , ఇప్పటి ప్రభుత్వ హయాంలో క్షణాల్లో , గంటల్లో , హత్యలు , అత్యాచారాలు , ముఖ్యంగా దళితులపై హింస జరుగుతుంటే మాట్లాడకుండా నోరుమూసుకున్న మేధావులు , ఉద్యమకారులు (కొందరిని వదిలేద్దాం ) ఏ మొహం పెట్టుకుని ఒక వ్యక్తి గతాన్ని గురించి మాట్లాడుతారు ? ఇట్లా మాట్లాడటం అంటే సమర్ధించటం కాదు కానీ గతాన్ని చూసి మార్పుని ఆహ్వానించక పోవడం మూర్ఖత్వం అవుతుంది అని చెప్పడం . అట్లా అంటే అనేక ఉద్యమ కారులు , పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారి గతాలు , రసవత్తరమైన ఘట్టాలు మన ముందు ఉన్నాయి కానీ ఎప్పుడైనా మాట్లాడామా ? అవి చూపించి వాళ్ళ అధికారానికి దూరం చేశామా ? విమర్శకి ఎవరూ అతీతం కాదు , దేవుడినే విమర్శించిన వాళ్ళం కానీ అది అడ్డం పెట్టుకుని ఒక మార్పుని ఆపాలనుకోవడం ఒక కుట్ర గానే చూడాలి . ఉన్నత మైన పదవిని వదులుకొని , హార్వార్డ్ విశ్వవిద్యాలయం లో తానూ ఒక కలగన్నాడు , అక్కడినుంచి రావడమే తన యూనిఫారం ని వదులుకుని బడుగు , బలహీన వర్గాలకి ఒక దిక్సూచి అయ్యాడు . ఒకప్పుడు ఎస్సి , ఎస్టీ హాస్టళ్లు అంటే అవినీతికి, అసాంఘిక కలాపాలకు , ఆడపిల్లల పైన అఘాయిత్యాలకి అడ్డాలు . వాటిని మార్చడానికి ఎంత శ్రమ పడ్డాడో మనమందరం కళ్ళారా చూశాము కానీ ఎక్కువగా మాట్లాడం ఎందుకంటే అది చేసింది ఒక దళితుడు కాబట్టి , అణగారిన కులాల పనికి , కష్టాన్ని , వాళ్ళ చరిత్రని పొగుడుతూ రాసిన ఆధిపత్య కులాలు ఎంతమంది , నాకైతే కనపడలేదు . మొహమాటానికి నాలుగు మాటలు అనడం వేరు అనుకోండి .
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో , జిల్లాలో ఒక నీలి విప్లవం మొదలయింది. ఎక్కడ చూసినా "నేను ఆరెస్పీ " అని స్వేరో లు తమ స్వంత ఇంట్లో పండగ లాగా భావించి డబ్బున్నా లేకపోయినా , ఆకలి తో ఉన్నా , వసతులు సరిగ్గా లేకపోయినా అత్యుత్సాహం తో అన్ని తామే అయి జిల్లా జిల్లాలో వేడుక చేసుకుంటున్నారు , చదువుకున్న వారు సోషియల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నారు. అటు పక్క చాప క్రింద నీరు లాగా మెల్లిగా ఎన్నారై లు తమ మద్దతుని పైకి కనపడకుండా బహుజన రాజ్య స్థాపనకు తమ వంతు కృషి చేస్తున్నారు . ఈ సమూహం డబ్బు ఇచ్చి , మద్యం , బిర్యాని , బస్సులు పెడితే వచ్చే సైన్యం కాదు, ఈ సైన్యం మార్పుకోసం వస్తున్న కొత్త ఉడుకు రక్తం.
ఇపుడు ప్రవీణ్ కుమార్ ఎవరు అని అంటున్నారు ? ఒక విద్యా వేత్త కాదు , ఒక మార్పు కోసం కల గన్న మేధావి కాదు , ఒక రాజకీయ నాయకుడు కాదు , కేవలం ఒక దళిత అందులో మాదిగ నాయకుడు మాత్రమే అని కదా అంటున్నది ? ఇది కాదా కుల తత్త్వం ? ఇన్ని ఏండ్ల స్వతంత్ర భారతం లో నూటికి తొంభై తొమ్మిది మంది నాయకులు ఆధిపత్య కులాల నుండి వస్తే ఎప్పుడైనా ఈ ప్రశ్న వేశారా ?ఒక రావుని , రెడ్డి ని , శర్మ ని , కమ్మని అట్లాగే పిలిచారా ? ఈ దళితులే కదా మీరు గెలవాలని ప్రతి పార్టీకి తమ కుటుంబాలని కూడా చూసుకోకుండా మీ గడీల ముందు కాలికి గజ్జె కట్టి ఆడి పాడింది ? ఉద్యమాలు , విప్లవాలు , సాహిత్యం , కళలు ఎక్కడ చూసినా మీరే కదా ఎప్పుడన్నా మీరు పలానా కులానికే నాయకులు అని ఈ అమాయక జనం అన్నారా ? మంచి నాయకులుగా వస్తారు తమ బ్రతుకులని మారుస్తారు అనే కదా మీ వెంట తిరిగింది మరి మీరు ఈరోజు చేస్తుంది ఏమిటి ? మీ పార్టీలలో ఉన్న కాడర్ ని వదిలేద్దాం , లీడర్ లని నోరు విప్పనిస్తున్నారా కనీసం ?అయినా మాకు ఆ బానిస బతుకులతో, కాన్షిరాం చెప్పిన చంచాలతో మాకు సంబంధం లేదు ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటి రెడ్డి కాస్త నిజాయితీగా ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడారు. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు నోరు మూసుకుంటున్నారు ? మీకు ఎట్లాగూ ఆట , పాట , డప్పు వంటి కళలు లేవు సరే మా సంపదని అంతా దోచుకుని బాగా సంపాదించి టెక్నలాజిని ఉపయోగించే స్థాయికి ఎదిగారు కదా ఎంతమంది ప్రవీణ్ కుమార్ కి మీ ట్విట్టర్ , ఇన్స్టా , వాట్సాప్ ల ద్వారా మద్దతు ప్రకటిస్తున్నారు ? కనీసం దూరంగా ఉన్నా మీకు తోచిన సహాయం చేస్తున్నారు ? అంటె మేము మీ పార్టీలలో ఉన్న ఎస్సి సెల్ , బిసి సెల్ బంధీలుగా మారాలా లెదా మోర్ఛాలకి మాత్రం పరిమితమై పోవాలి అంతేనా ? మీ కులపోల్లకి దళితులూ , బహుజనులు ఊడిగం చేసినప్పుడు మళ్ళీ మీకు తిరిగి చేసే కనీస బాధ్యత లేదా ? మీరు మీకంటే ఉన్నత చదువు చదువుకున్న వ్యక్తి ,ఉద్యోగం చేసిన వ్యక్తి , తెలివి తేటలు ఉన్న వ్యక్తి ఒక రాజకీయ పార్టీతో ముందుకు వస్తున్నపుడు ఎందుకు ఆహ్వానించరు ? ఇది కాదా కులతత్వం ? అంబెడ్కర్ రచించిన రాజ్యాంగం అందరికి సమాన హక్కులు ఇస్తుంది , అవి అన్ని అందరికి సమానంగానే చెందాలి కదా కనీసం ఆ సమానత్వం మీద గౌరవం ఉంటె మీరు ఇట్లా నోరు మూసుకుంటారా ? ఒక నాయకుడు , ఒక జాతీయ పార్టీ కి మీరు ఇచ్చే గౌరవం ఇంతేనా ? మీరు ఇవ్వనప్పుడు అశేష శ్రామిక ప్రజానీకం మీకు ఎందుకు ఇవ్వాలి ? ఇంక ఇవ్వడం కష్టమే , మేము అడుక్కునే రోజులు పోయాయి , బరి గీసి గుంజుకునే రోజులు వచ్చాయి .
విప్లవం , ఉద్యమం పేరుతొ కుల రాజకీయాలు చేసింది ఎవరు ? రాజకీయం అంటే రంకు , బొంకు , బూర్జువా అని మాటలు చెప్పి , అధికారానికి దూరం చేసింది చాలు. రాజకీయం అంటే కేవలం ఓట్లు , నోట్లు కాదు స్వయం పాలన , సాధికారత అని చెప్పడానికి బీఎస్పీ పార్టీ ఉనికిలోకి వచ్చింది. తరువాత వచ్చిన నాయకత్వం తప్పులు ఉండొచ్చు కానీ అవి కూడా సరిదిద్దుకోవడం భాద్యత , అవసరం కదా ? ఈ రోజు ని ఆహ్వానించడం , ఒక కొత్త నీరు ని పారనివ్వడం ఇప్పుడు అవసరం. అందుకు అందరూ సహకరించాలి , కేవలం మేము అధికారం లో ఉంటాం మీరు మా వెంట పని వాళ్ళు గా ఉండండి అనే మీ భావాలకి కాలం చెల్లింది. అది అందరం తెలుసుకోవాలి . ఒకటే కుటుంబం లో నుండి తరతరాలుగా వారసులు రావాలి అనే భావన కూడా కులాధిపత్యానికి సంబంధించిందే.
సో మై డియర్ కామ్రేడ్స్ , ఫ్రెండ్స్ మన అనుమానాలని , భయాలని పక్కన పెట్టి ప్రవీణ్ కుమార్ IPS ని స్వాగతిద్దాం . తానూ ఎత్తుకున్న అక్షరం , ఆరోగ్యం , ఆర్థికం , ఆత్మగౌరవం నినాదాలకి ఊపిరి పోద్దాం . ఇప్పటివరకు మన మీద రుద్ద బడిన చచ్చు, పుచ్చు పట్టిన రాజకీయాలనుండి తప్పుకొని ఒక కొత్త తరానికి బహుజన రాజ్యాధికార బాట వేద్దాం . ఇన్ని రోజులు మీరు అనుభవించారుగా కాస్త తప్పుకొని ఇతరులని రానిస్తే పోయేది , మీ ఆస్థి తరిగేది ఏది లేదు. ఇక్కడ మైనారిటీలు మహిళలలకి ఇప్పటికే పెద్ద పీఠ వేస్తున్నారు మంచి శుభారంభం, ఆదివాసీలని కూడా కలుపుకొని తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేద్దాం .
చివరగా , రేపటి సభకి వచ్చే వాళ్ళందరూ ఓట్లు వేసినా ప్రవీణ్ కుమార్ , బీఎస్పీ ఇక్కడ నిలబడుతుంది కానీ ఇప్పడు అందరూ విడగొట్టే రాజకీయాలు , భయపెట్టే కుట్రలు , కుతంత్రాలు చేస్తారు వాటి అన్నింటినుండి అప్రమతాంగా ఉండాలి. విమర్శని హుందాగా తీసుకోవాలి , దయచేసి మరొక తీవ్రవాద మూకలుగా మారవద్దు. పూలే, అంబెడ్కర్ , కాన్షిరాం లు తమ తెలివి తేటలతోనే అందరిని జయించారు. దాడులు , ప్రతి దాడులు కాదు. ఆ అవసరం రాదనే అనుకుందాం . స్వేచ్చా , సమానత్వం , సౌభ్రాతృత్వం పునాదిగా పని చేద్దాం . ఇంత చేసినా మార్పు లేదు అనిపించిన రోజున మనం ఎట్లాగూ ఉన్నాము కదా ప్రశ్నించడానికి , ఎదిరించడానికి . కాళోజి చెప్పినట్టు ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ..పాతరేస్తాం ,మీరు , మీ వాళ్ళు అని వేయరు కానీ బహుజనులు తప్పకుండా ఆ పని చేస్తారు.
(కోవిద్ జాగ్రత్తలు అందరు పాటించాలని కోరుకుంటూ )
సుజాత సూరేపల్లి .