2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హాట్ హాట్ గా మారబోతున్నాయి. రెండేళ్ల ముందే వచ్చిన ఎన్నికల కోలాహలం దీనికి ఉదాహరణ. 70 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా పొలిటికల్ పార్టీలు-నేతలు ఊరూ-వాడా చుట్టేస్తుండటంతో అప్పుడే రాజకీయం వేడెక్కింది. దీంతో రాజకీయ నిరుద్యోగులకు జాక్ పాట్ గా మారాయి రాబోయే ఎన్నికలు. హైకమాండ్ ఆదరణ లేక అధినేత ఆశిస్సులు దక్కక రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న నేతలంతా ఇపుడు ఖుషీ ఖుషీగా కనిపిస్తున్నారు. అన్ని పార్టీల నుంచి కీలక నేతలకు ఆహ్వానాలు అందుతుండటంతో... వేచి చూసే ధోరణిలో ఉన్నారంతా.
నియోజకవర్గాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ ను మినహాయిస్తే... అంతో ఇంతో పేరున్న-బలమున్న-బలగమున్న నేతలకు మంచి రోజులొచ్చినట్టు కనిపిస్తోంది. సర్వేల అంచనాలతో ప్రతిపక్ష పార్టీలు ఆయా నేతలకు గాలమేస్తున్నాయి. వస్తున్న ఆహ్వానాలను కాదనలేక చర్చలు జరిపి... ఖర్చీఫ్ వేసుకుని కూర్చుంటున్న నేతలకూ కొదవ లేదు. ముఖ్యంగా టీఆర్ఎస్ లో ఉంటూ కేసీఆర్ చేతిలో మోసపోయిన నేతలు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయ పునరేకీకరణ పేరుతో ఇబ్బడి ముబ్బడిగా చేరికలకు గేట్లెత్తడంతో కారు ఓవర్ లోడైంది. గులాబీ పార్టీలోనే ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు ఆశించే నేతల సంఖ్య ఐదారుగురు తయారయ్యారు. దానికితోడు ఉద్యమకారులను కాదని వలస వచ్చిన నేతలను నెత్తిన పెట్టుకున్న పాపం కారును బోల్తా కొట్టించబోతోందట. వీటికితోడు సిట్టింగులపై వ్యతిరేకత సరేసరి. ఎవరికి టికెట్ వస్తుందో... ఎవరిపై కత్తి వేలాడుతుందో తెలియని డైలమా. దాంతో గులాబీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికో, కమలం గూటికో చేరేందుకు రెడీ అవుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది.
ఇకపోతే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు చేరికతో కాంగ్రెస్ సమరానికి సిద్ధమైంది. వరంగల్ డిక్లరేషన్ తో అనూహ్యంగా రేసులోకొచ్చిన కాంగ్రెస్ రేసుగుర్రంలా మారింది. నిన్న మొన్నటిదాకా బీజేపీ వైపు చూసిన నేతలకు కాంగ్రెస్ బెటర్ ఆప్షన్ లా మారిందిప్పుడు. దాంతో మెజారిటీ నేతలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారట. అయితే రాహుల్ పదే పదే చెప్తున్నట్టు వలస వచ్చిన నేతలకు టికెట్లిచ్చేది లేదు... పార్టీ కోసం పనిచేసే వాళ్లకే బీ ఫాం అన్న ప్రకటన చాలామందిని ఆపుతోంది. దీనికితోడు కాంగ్రెస్ లోని అపరమిత ప్రజాస్వామ్యం చేరికలకు ఆటంకంగా మారిందట. నిజానికి టీఆర్ఎస్-బీజేపీ కలిపి కొట్టిన వరుస దెబ్బలతో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థులు కరువయ్యారు. క్యాడర్ సుస్థిరంగా ఉన్నా... నడిపించే నాయకులు లేరు. దాంతో చేరికలకు కాంగ్రెస్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇకపోతే బీజేపీ పరిస్థితి ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. ఈటల రాజేందర్ విజయంతో ఒక్కసారిగా బీజేపీ రేసులోకొచ్చింది. నిజానికి బీజేపీకి ఫోర్ డిజిట్ ఓటు బ్యాంకు లేని స్థానాలు చాలానే. సాగర్ ఉప ఎన్నిక రుజువు చేసిందదే. దాంతో బీజేపీలో చేరికకు వెనుకా ముందు అడుతున్న వాళ్లు చాలామందే ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహార శైలి మింగుడు పడని వాళ్లు వేచిచూస్తున్నారట. ఈటల రాజేందర్ కు ఛాన్సిస్తే బీజేపీలోకి భారీగా చేరికలుంటాయన్న అంచనాలున్నాయి. కానీ ఈటలకు పార్టీ నుంచి అంత గ్రిప్ రావాలి కదా ? దాంతో బీజేపీతోనూ సంప్రదింపులు జరిపి ఊరుకుంటున్నారట కొందరు సీనియర్లు.
వీటికితోడు బీఎస్పీ, వైఎస్సార్టీపీ, జనసేన, వామపక్షాలు, కే ఏ పాల్ ప్రజాశాంతి లాంటి తోక పార్టీలు ఉండనే ఉన్నాయి. సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. దాంతో ఏదో ఒక పార్టీ టికెట్ అనుకుంటున్న లీడర్లకు బంపర్ ఆఫర్ లా కనిపిస్తున్నాయి వచ్చే ఎన్నికలు. తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి వాళ్లు ఇప్పటికీ వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది ఇందుకేనట. ఇలాంటి ఆశావహులకు ఏదో ఒక పార్టీ టికెట్ గ్యారెంటీ. కానీ అది ఏ పార్టీ అన్నదే సస్పెన్స్. ఆ సస్పెన్స్ కు తెరపడాలంటే మరికొన్ని నెలల ఈ రాజకీయ సందిగ్ధాన్ని దాటాల్సిందే. మొత్తమ్మీద రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో భారీగా మార్పు చేర్పులను చూడబోతున్నామట.