ఆట మొదలైంది.. వెయ్యి ఊడల మర్రి సాక్షిగా అమిత్ షా ఏం చెప్పబోతున్నారు..?
ఆట మొదలైంది.. వెయ్యి ఊడల మర్రి సాక్షిగా అమిత్ షా ఏం చెప్పబోతున్నారు..?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన దాదాపు ఖరారు అయింది. ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి అమిత్ షా రానున్నట్లు తాజాగా ఎంపీ సోయం బాపూరావు ప్రకటించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ వెయ్యి ఊడల మర్రి వద్ద సభకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా పర్యటన రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు బ్రేక్ ఇచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నిర్మల్‌లోని వెయ్యి ఊడల మర్రి వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది.
కాగా, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని రజాకార్లు మర్రి చెట్టు వద్ద ఊచకోత కోశారు. దీంతో కాలక్రమంలో వెయ్యి ఊడల మర్రిగా ప్రసిద్ధి చెందింది. అదే వెయ్యి ఊడల మర్రి చెట్టు వద్ద భాజపా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. ఇక వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే అమిత్ షా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలపై కన్నేసిన బీజేపీ అధిష్టానం నిర్మల్ సభలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెయ్యి ఊడల మర్రి సభలో అమిత్ షా ఏం చెప్పబోతున్నారనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.