సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డ మరో ఐపీఎస్ అధికారి
23 Aug 2021 జాతీయం 590

సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డ మరో ఐపీఎస్ అధికారి

తెలంగాణ రాష్ట్ర సర్కారుపై మాజీ ఐపీఎస్ అధికారి  డీజీ వీకే సింగ్  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి  ఏమీ లేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తాను త్వరలోనే బయట పెడతానని, అవసరమైతే ఇంటింటా  తిరిగి ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని... అవినీతి వేళ్లూనుకుపోయిందని అసహనం వ్యక్తం చేశారు. స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, భగత్సింగ్లను ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కష్టపడతానని తెలిపారు. యువకుల ఆత్మబలిదానాలతో సాకారమైన బంగారు తెలంగాణ... ప్రస్తుతం కంగారు తెలంగాణగా మారిందని వీకే సింగ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎన్నికల కోసమే పని చేస్తోందని... ప్రజల కోసం కాదని వీకే సింగ్ విమర్శించారు.

వీకే సింగ్ సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘ కేసీఆర్ చేసింది తన ఏడేళ్ల పాలనలో  రాష్ట్రాన్ని దేశంలోనే అవినీతి రాష్ట్రంగా మార్చారు. కేసీఆర్ చేసిన మోసాలను ప్రజలకు త్వరలోనే చూపిస్తాను. అయన  వైఫల్యాలు బయట పెట్టేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సద్భావన యాత్ర చేస్తాను. ‘జన సేవ సంఘ్’ స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో రాజకీయేతర ఉద్యమం కొనసాగిస్తాను’’ అని వీకే సింగ్ అన్నారు. అయితే వీకే సింగ్ కూడా మాజీ ఐపీఎస్ అధికారి బీఎస్పీ నేత ఆర్ ఎస్  ప్రవీణ్ కుమార్ ‌లాగే ప్రభుత్వంతో విబేధించి స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్నారు. అయితే వీఆర్ఎస్ తీసుకున్న వెంటనే  ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చారు. కాగా, వీకే సింగ్ కూడా ఇప్పుడు కేసీఆర్ సర్కారుపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటనను ప్రకటించడంతో ఆయన కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే అనుమానాలు లేవనెత్తుతున్నాయి.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV