రాఖీ పండగ సాక్షిగా జగన్‌కు ఊహించని షాక్ ఇచ్చిన షర్మిల
రాఖీ పండగ సాక్షిగా జగన్‌కు ఊహించని షాక్ ఇచ్చిన షర్మిల
వైఎస్సార్‌టీపీతో తెలంగాణ రాజకీయాల్లో అరంగేట్రం చేసిన వైఎస్ కుమార్తె, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై దూకుడుగా వ్యవహరిస్తు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అయితే తన అన్న వైఎస్ జగన్‌తో తలెత్తిన విబేధాలు రావడంతోనే షర్మిల తెలంగాణలో కొత్త కుంపటి పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. కానీ ఈ విషయంపై షర్మిల ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. ఇక వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రతీ ఏడాది అన్న జగన్ తో కలిసి తండ్రి సమాధిని దర్శించుకునే షర్మిల.. ఈ ఏడాది తల్లి విజయమ్మతో కలిసి వెళ్లారు. అన్నను కలుసుకోవడం ఇష్టంలేకే షర్మిల అలా చేసినట్లు అప్పట్లో అంతా భావించారు.
అయితే తెలంగాణలో తన పార్టీ స్థాపించనప్పటి నుంచి అన్న జగన్‌ను ఒక్కసారి కూడా నేరుగా కలుసుకోని షర్మిల రాఖీ పండగ సందర్భంగానైనా జగన్‌ను కలిసి రాఖీ కడతారేమోనని వైఎస్ అభిమానులు అనుకున్నారు. కానీ రాఖీ సందర్భంగా ఆదివారం ఉదయం ట్వీట్ చేసిన షర్మిల.. "నా తోడబుట్టిన జగనన్నకు మరియు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సోదరి షర్మిల" అంటూ ట్వీట్ చేశారు. ఇక ఇది చూసిన నెటిజన్లు అన్న జగన్‌ను నేరుగా కలవడం ఇష్టంలేకే షర్మిల ఆయన పేరును ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారని ట్విట్టర్ వేదికగా కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలావుంటే, జగన్ రాజకీయ జీవితంలో షర్మిల పాత్రను వైఎస్ అభిమానులెవరూ మర్చిపోలేరు. జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూనే పాదయాత్ర ద్వారా తమ కుటుంబానికి సానుభూతి సంపాదించి పెట్టారు. 2019 ఎన్నికల సమయంలో ఆమె పార్టీ యంత్రాంగంతో కలిసి జగన్ కోసం ఇంటింటా ప్రచారం చేశారు. ముఖ్యంగా బై.. బై.. బాబు అంటూ షర్మిల చేసిన నినాదం వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. అయితే ఇప్పుడు అన్నాచెల్లెళ్ల రాష్ట్రాలు వేరు, పార్టీలు వేరు కావడంతో స్వప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.