మెగా హీరో రామ్ చరణ్ వరుసగా కొత్త సినిమాలు ఓకే చేసుకుంటున్నాడు. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'తో పాటు 'ఆచార్య' సినిమాలో కూడా చరణ్ నటిస్తున్నాడు. వీటి తర్వాత అగ్రశ్రేణి దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది కూడా. ప్రముఖ నిర్మాత దిల్ రాజు వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తమ 50వ చిత్రంగా దీనిని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. చరణ్ కెరీర్లోనే ఇదొక అద్భుతమైన సినిమాగా నిలిచిపోతుందని అంటున్నారు.
ఇక శంకర్ సినిమాతో పాటుగా తాజాగా మరో చిత్రాన్ని కూడా చరణ్ ఓకే చేశాడని తెలుస్తోంది. ఆమధ్య నాని హీరోగా 'జెర్సీ' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. గౌతమ్ చెప్పిన కథకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం 'జెర్సీ' చిత్రాన్ని గౌతమ్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక చరణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని తెలుస్తోంది.