టీఆర్ఎస్ ఓటెవరికి ? త్వరలో రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్
10 May 2022 జాతీయం 404

దేశంలో మరో కీలక రాజకీయ ఘట్టం చోటుచేసుకోబోతున్నది. దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి ఈ నెల 15 తర్వాత నోటిఫికేషన్ విడుదల కాబోతున్నది. జూలై 25తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ పదవీకాలం ముగియనున్నది. దాంతో దేశ 15వ రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికవుతారన్నది ఆసక్తికరంగా మారింది. 

ఓట్ల పరంగా, పార్లమెంటులో, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కారణంగా... బీజేపీ సిఫార్సు చేసిన అభ్యర్థిదే విజయం. మొత్తం పదిన్నర లక్షల ఓట్లలో 51 శాతం ఓట్లు పోలైన వాళ్లదే విజయం. అయితే మ్యాజిక్ ఫిగర్ కి కేవలం 10 వేల ఓట్ల దూరంలో ఉంది బీజేపీ. దాంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలకంగా మారారు.

2017 రాష్ట్రపతి ఎన్నికలకు ముందు బీజేపీతో కేంద్రంతో కేసీఆర్ కు సఖ్యత ఉండేది. దాంతో బీజేపీ అభ్యర్థికే టీఆర్ఎస్ మద్ధతు ఇచ్చింది. కానీ గత కొంతకాలంగా మోడీ సర్కారుపై ఒంటి కాలుపై లేస్తున్నారు కేసీఆర్. దేశ రాజకీయాలకు మారుస్తానని మోడీని గద్దె దింపే శక్తుల కోసం వేట మొదలుపెట్టారు. ప్రస్తుతం గులాబీ బాస్ తీరు చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అభ్యర్థికి మద్ధతిచ్చే ప్రసక్తి కనిపించడం లేదు. అలాగని కాంగ్రెస్ కూటమి నిలబెట్టే అభ్యర్థికీ ఓటేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కు ఎలక్టోరల్ కాలజీలో సరిపడా బలం లేనందున ప్రతిపక్షాలన్నీ కూటమిగా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలబెట్టబోతున్నాయట. దాంతో కేసీఆర్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

మోడీకి షాక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో దేశంలో బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ఏకమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికి రాష్ట్రపతి ఎన్నికలే తొలి అడుగుగా నిర్ణయించుకున్నాయి. నాన్ కాంగ్రెస్ అభ్యర్థిని తెరపైకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. దీనికోసం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. శరద్ పవార్ ని ముందు పెట్టి బీజేపీని కార్నర్ చేయాలన్నది ఈ కూటమి ప్లాన్. ఇదెంత వరకు వర్కవుట్ అవుతుందో లేదో తెలీదు కానీ... కేసీఆర్ వైఖరి మాత్రం రాష్ట్రపతి ఎన్నికలతో తేలిపోనుంది. దాన్ని బట్టే కేసీఆర్ ని ఇతర ప్రాంతీయ పార్టీ నేతలు నమ్మడమా ? ఆయన్ని పక్కన పెట్టడమా అన్నది డిసైడ్ అవుతుంది. మరో నెల రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. 

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV