48 గంటల్లో క్రిమినల్ రికార్డులు బయటపెట్టాలి.. రాజకీయ పార్టీలకు సుప్రీం సంచలన ఆదేశాలు
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు ఎంపికైన 48 గంటల లోపు వారి క్రిమినల్ రికార్డులను వెల్లడించాలని ప్రకటించింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడి ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గతేడాది ఫిబ్రవరి 13న తాము ఇచ్చిన తీర్పులో కొన్ని మార్పులు చేసింది. 2020 ఫిబ్రవరి తీర్పులో అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటలలోపు లేదా నామినేషన్ల దాఖలుకు మొదటి తేదీకి రెండు వారాల ముందు వారి నేర చరిత్రను ప్రకటించాలని సుప్రీం ఆదేశించింది.
కాగా, గతేడాది నవంబరులో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల నేరచరిత్రను వెల్లడించడంతో రాజకీయ పార్టీలు విఫలమైనందుకు దాఖలు చేసిన ధిక్కార పిటిషన్లలో సుప్రీం బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఈ క్రమంలోనే జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, బిఆర్ గవాయ్ లతో కూడిన ధర్మాసనం 2020 ఫిబ్రవరి 13 న ఇచ్చిన తీర్పును సవరించింది. తాజాగా చేసిన మార్పుల ప్రకారం ఆయా పార్టీలే తమ అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను బయటపెట్టాల్సిందిగా అత్యున్నత ధర్మాసనం స్పష్టంచేసింది.
మరోవైపు కోర్టులు జరిపే విచారణలపై పిటిషనర్లు విశ్వాసం ఉంచాలని సుప్రీంకోర్టు తెలిపింది. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ ( Pegasus )తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై దాఖలైన పలు పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఎవరూ తమ హద్దుల్ని దాటొద్దని, ప్రతి ఒక్కరికీ అవకాశం ఇస్తామని సీజేఐ తెలిపారు. కోర్టులో కేసు వాదనలు జరుగుతుంటే, పిటిషనర్లు సోషల్ మీడియాలో సమాంతర చర్చలు చేపట్టడం దేనికి అని కోర్టు ప్రశ్నించింది. ఈరోజు విచారణ సమయంలో సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా పాల్గొన్నారు.