బీజేపీలో ఉన్న కోటిలింగాలలో ఈటెల ఓ బోడిలింగం: రేవంత్ రెడ్డి
బీజేపీలో ఉన్న కోటిలింగాలలో ఈటెల ఓ బోడిలింగం: రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు చింతలపల్లికి చేరుకుని దీక్షను ప్రారంభించారు. ఈ దీక్ష రేపు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఓడిపోయినా కేసీఆర్ పదవికి ఎలాంటి నష్టం ఉండదని.. బీజేపీ గెలిచినా మోదీకి ప్రధాని కంటే పెద్ద పదవి రాదని ఆయన అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్న కోటిలింగాలలో ఓ బోడిలింగం అవుతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భూములు కబ్జా చేసిండని.. ఈటల రాజేందర్‌ని జైలుకి పంపిస్తామన్నంత రేంజ్‌లో కేసీఆర్ హడావుడి చేశారని రేవంత్ అన్నారు. బీజేపీ పార్టీలోకి చేరగానే ఆ కేసు ఎటు పోయిందని ఆయన ప్రశ్నించారు.
కాగా, ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు నిర్వహించతలపెట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే ఇంద్రవెల్లి, రావిర్యాలలలో బహిరంగ సభలు నిర్వహించగా ఇది మొదటి దీక్షా కార్యక్రమం. మూడుచింతలపల్లి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం కావడంతో రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని తెలంగాణ సమాజానికి తెలియజేయడానికే ఇక్కడ రెండు రోజుల దీక్షకు నిర్ణయించినట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు.