కేంద్రమంత్రి హోదాలో అబద్దాలు ప్రచారం చేస్తున్న కిషన్ రెడ్డి - మంత్రి జగదీష్ రెడ్డి
21 Aug 2021 జాతీయం 480

కేంద్రమంత్రి హోదాలో అబద్దాలు ప్రచారం చేస్తున్న కిషన్ రెడ్డి - మంత్రి జగదీష్ రెడ్డి
 
కేంద్రమంత్రి హోదాలో అబద్దాలు ప్రచారం చేస్తూ దానికి ఆశీర్వాదయాత్రగా నామకరణం చేయడం విడ్డురంగా ఉందని బీజేపీ నేత కిషన్ రెడ్డి యాత్రపై మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు.
ఈ మేరకు శుక్రవారం సాయంత్రం శాసనసభ ప్రాంగణంలోనీ టి ఆర్ యస్ ఎల్ పి కార్యాలయంలో సహచర శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రి హోదాలో ఆశీర్వాద యాత్ర పేరుతో అబద్దాలు ప్రచారం చేయడం కిషన్ రెడ్డికే చెల్లిందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన చేపట్టిన ఆశీర్వాద యాత్రకు అర్థం లేదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఎందుకు ఆశీర్వాద యాత్ర అన్నది ఆయనకు ఆయనే సింహవలోకనం చేసుకోవాలని ఆయన హితవుపలికారు. మోడీ సర్కారు రైతుల నడ్డి విరిచే చట్టాలు తెస్తున్నందుకు ప్రజలు బిజెపి ని ఆశీర్వదించాలా అంటూ ఆయన విసుర్లు విసిరారు. అసలు ఆశీర్వాద యాత్ర ఎందుకో అన్నది ఆయన తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి రైతులమీద పెను భారం మోపినందుకా ఆ ఆయాత్ర అంటూ ఆయన నిలదీశారు. లేక రేపో మాపో సవరణ పేరుతో విద్యుత్ చట్టాన్ని సవరించి కార్పొరేట్ రంగానికి అప్పగించబోతున్నందుకా ఆ ఆశిర్వాద యాత్రా అంటూ ఆయన నిలదీశారు.
అసలు ఆశీర్వాద యాత్ర ఎందుకో వారికి వారు ఉన్న పార్టీకే స్పష్టత ఉందని ప్రజలు భావించడం లేదన్నారు.పైగా కేంద్రం ఇస్తున్న నిధులలో దుర్వినియోగం జరుగుతుందంటూ ఆశీర్వాద యాత్రలో కొత్త పల్లవి అందుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎక్కడ దుర్వినియోగం జరిగింది అన్నది రుజువు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న నిధులలో కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంటుందన్న చిన్న లాజిక్ తెలియని ఆయన కేంద్రమంత్రి ఎలా అయ్యారో అన్నది ప్రజలకు అర్థం కావడం లేదన్నారు.
రాష్ట్రాల వాటా రాష్ట్రాలకు ఇస్తున్నారే తప్ప కేంద్రప్రభుత్వం పాకిస్తాన్ నుండి తెచ్చి ఇవ్వడం లేదన్న నిజాన్ని ఆయన గ్రహించాలి అన్నారు. కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిధుల గురించి నోటికి వచ్చినట్లు ప్రగలభిస్తున్న కిషన్ రెడ్డి బిజెపి పాలిత రాష్ట్రాలలో 2,000 ఫించన్ ఎందుకు అమలు చేయడం లేదు అన్నది తేల్చిచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.లేని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి నేతలు మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో నైనా ఫించన్ పధకం అమలు అవుతుందా అంటూ ఆయన నిలదీశారు. అంతెందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పధకాలు కాపీ కొడుతూ తమ డొల్ల తనాన్ని బయట పెట్టుకుంది బిజెపి నేతలే నంటూ ఆయన విమర్శించారు. అంతెందుకు టీఆర్ఎస్ ఎలుబడిలో ఉన్న తెలంగాణా రాష్ట్రంలో మిషన్ భగీరథ భేషుగ్గా ఉందంటూ బిజెపి కి చెందిన కేంద్ర జలవనరుల శాఖామంత్రి స్వయంగా పార్లమెంట్ లో చెప్పిన అంశమే టీఆర్ఎస్ పాలనకు అద్దం పడుతుందన్నారు.
హైదరాబాద్ లో తాలిబన్లు ఉన్నారు అంటూ బిజెపి ప్రకటన చేస్తుంది అంటే కేంద్రాన్ని పాలించడం లో ముమ్మాటికి మోడీ సర్కారు ఫెయిల్ అయినట్లేనని ఆయన తేల్చిచెప్పారు. శాంతిభద్రతల అంశంలో తెలంగాణా పోలీస్ దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుందని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణల ఫలితమే నంటూ ఆయన కొనియాడారు. దేశభద్రతకు గాను సరిహద్దుల్లో రక్షణ కొరవడిందని మోడీ సర్కార్ భావిస్తే ఆ బాధ్యత మీద వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఒక్క తెలంగాణా సమాజమే కాకుండా ఆంద్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు.
అబద్దాలు చెప్పడం,అర్థం లేని మాటలు మాట్లాడడం బిజెపి నేతలకే చెల్లిందని దాని పేరే ఆశీర్వద యాత్ర అనుకుంటే అది వారి విజ్ఞత అని ఆయన అన్నారు. పార్లమెంట్ లో ఒక మాట బయట ఒక మాట మీడియా ఎదురుగా మరొమాట మాట్లాడుతున్న బిజీపీ కి దేశ ప్రజలు త్వరలో షాక్ ను ఇవ్వనున్నారన్నారు.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV