ఖేల్‌రత్న పేరు మార్పు.. ఓ రాజకీయ ఆట: కేంద్రంపై ధ్వజమెత్తిన శివసేన
కేంద్ర ప్రభుత్వం తన ‘పొలిటికల్ గేమ్’లో భాగంగానే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చిందని శివసేన మండిపడింది. దేశ ప్రజలు కోరిక మేరకు మారినది కాదని, ఇదో పొలిటికల్ గేమ్ అని శివసేన తన అధికారిక పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభ భాయ్ పటేల్ పేరిట గల క్రికెట్ స్టేడియం పేరును ప్రధాని మోదీ పేరిట మార్చారని, అయితే క్రికెట్ రంగానికి ఆయన చేసిన సేవలేమిటని శివసేన ప్రశ్నించింది. ఢిల్లీ క్రికెట్ స్టేడియం పేరును దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ పేరుతో మార్చడానికి కూడా ఇదే వర్తిస్తుందా అని ప్రశ్నించింది.
టోక్యో ఒలంపిక్స్ లో పురుషుల, మహిళల హాకీ జట్లు మంచి ప్రతిభ కనబరచిన కారణంగా ధ్యాన్ చంద్ గౌరవార్థం ఆయన పేరిట ఈ అవార్డు పేరును మార్చాలని దేశంలోని అనేక ప్రాంతాల ప్రజల నుంచి తమకు అభ్యర్థనలు అందాయని , అందువల్ల ఇలా పేరు మారుస్తున్నామని మోదీ ఇటీవల పేర్కొన్నారు. కానీ ఇది ప్రజల అభిమతం కాదు.. పొలిటికల్ గేమ్ అని శివసేన తమ సామ్నా పత్రికలో విమర్శించింది.
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఇద్దరూ ఈ దేశం కోసం తమ ప్రాణాలు అర్పించారు. రాజకీయంగా ఎన్ని అభిప్రాయబేధాలు ఉన్నా.. దేశానికి వారు చేసిన త్యాగాలను తక్కువ చేయడం సరైన పద్ధతి కాదు రాజీవ్‌గాంధీని అవమానించకుండా కూడా ధ్యాన్‌చంద్‌ను గౌరవించుకోవచ్చు. కేవలం రాజకీయ కారణాలతో రాజీవ్ పేరును తొలగించడం సరికాదు అని శివసేన ధ్వజమెత్తింది. బడ్జెట్‌లో క్రీడలకు రూ.300 కోట్లు కోత పెట్టిన కేంద్రం టోక్యో ఒలింపిక్స్ లో భారత్ సాధించిన విజయాన్ని తన విజయంగా చెప్పుకుంటోందని ఎద్దేవా చేసింది.