రసవత్తరంగా ‘మా’రిన ఎన్నికలు.. రంగంలోకి దిగిన చిరంజీవి
రసవత్తరంగా ‘మా’రిన ఎన్నికలు.. రంగంలోకి దిగిన చిరంజీవి
ఎప్పటిలాగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల వ్యవహారం మరోసారి రసవత్తరంగా మారింది. ఇప్పటిదాకా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. అధ్యక్ష పోటీలో ఐదుగురు బరిలోకి దిగడం సినీ వర్గాల్లో చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇటీవల మా ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌పై నటి హేమ.. సరైన లెక్కలు చెప్పకుండా డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నరేష్ మాట్లాడుతూ ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేనంతగా మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. మా ఎన్నికలపై చిరు తొలిసారిగా పెదవివిప్పారు.
ఈ క్రమంలోనే ’మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు ఓ లేఖ రాశారు. మా ఎన్నికలు వెంటనే నిర్వహించాలని.. ఎన్నికలు గనుక ఆలస్యమైతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయని లేఖలో పేర్కొన్నారు. అలాగే సభ్యుల బహిరంగ ఆరోపణలతో ‘మా’ ప్రతిష్ట దెబ్బతింతోందని, అందుకు కారణమైన వారిని ఉపేక్షించవద్దని చిరంజీవి లేఖలో కృష్ణంరాజును కోరారు.
ఇదిలావుంటే.. 'మా' అధ్యక్ష పదవి కోసం ఐదుగురు హోరాహోరీగా పోటీ పడుతుండటంతో ‘మా’ ఎన్నికలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ‘మా’ అభివృద్ధే నినాదంగా అందరూ బరిలోకి దిగుతుండటంతో టాలీవుడ్ వైపే అందరి దృష్టి ఉంది. ఈ రసవత్తర పోటీలో ఎవరి సపోర్ట్ ఎవరికి ఉందో.. ఎవరు ఎన్నికల బరిలో గెలుపొందుతారో.. తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడకతప్పదు.