వైఎస్‌ఆర్‌టీపీ కోసం ఆయన రంగంలోకి.. షర్మిల స్కెచ్ మామూలుగా లేదుగా..
26 Aug 2021 జాతీయం 653

వైఎస్‌ఆర్‌టీపీ కోసం ఆయన రంగంలోకి.. షర్మిల స్కెచ్ మామూలుగా లేదుగా..
 
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్సార్‌టీపీ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు వైఎస్ షర్మిల. నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నిరుద్యోగ నిరాహరదీక్ష పేరుతో ప్రతి మంగళవారం జిల్లాల్లో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున స్పందన కూడా వస్తోంది. ఇదంతా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వైఎస్సార్‌టీపీ పార్టీ పనిచేస్తోంది. కాగా, పార్టీ వ్యూహాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ను షర్మిల నియమించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆయన రంగంలోకి దిగనున్నారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. 
 
ఇటీవలే మహిళా నేత ఇందిరా శోభన్ పార్టీకి రాజీనామ చేయడంతో కార్యకర్తలు డీలా పడ్డారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ తన టీమ్‌ను రంగంలోకి దించుతున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ప్రశాంత్ కిశోర్ ఇక ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని స్పష్టం చేశారు. అయితే అంతకుముందే షర్మిలతో ఆయన బృందం ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఒప్పందంలో భాగంగానే షర్మిల పార్టీతో ఆయన పనిచేయబోతున్నారనే చర్చ జరుగుతోంది.
 
అయితే ప్రశాంత్ కిశోర్ నేరుగా కాకుండా తెర వెనుకుండే సలహాలు, సూచనలు అందించనున్నారని తెలుస్తోంది. మరో ఏడాదిన్నరలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీకే నేరుగా రంగంలోకి దిగి పార్టీ తరపున వ్యూహాలు అమలు పరుస్తారని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో అన్న జగన్‌ని అధికారంలోకి తీసుకొచ్చినట్లే.. తెలంగాణలో చెల్లెలు షర్మిలను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు రూపొందించినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV