ఇకపై ఆగస్టు 14న ‘విభజన స్మృతి దివస్’: ప్రధాని మోదీ సంచలన ప్రకటన
ఇకపై ప్రతీ ఏడాది ఆగస్టు 14వ తేదీని ‘విభజన స్మృతి దివస్’ ( Partition Horrors Remembrance Day )గా జరుపుకోనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రకటించారు. భారత్, పాకిస్థాన్ విభజన సమయంలో ప్రజలు పడిన బాధలను ఎన్నటికీ మర్చిపోలేమని మోదీ అన్నారు. అందుకే ప్రజల కష్టాలు, త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఇకపై ఆగస్టు 14ను ‘విభజన స్మృతి దివస్‌గా జరుపుకొందామని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా శనివారం ప్రకటించారు
దేశ విభజన వల్ల కలిగిన బాధలను ఎన్నటికీ మరిచిపోలేమని మోదీ చెప్పారు. భారత్, పాక్ విభజనతో లక్షలాది మంది సోదర సోదరీమణులు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆనాడు జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఆగస్టు 14ను విభజన స్మృతి దివస్‌గా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్మృతి దినం ఏకత్వ స్పూర్తిని నింపాలని మోదీ తెలిపారు.
మరోవైపు భారత్, పాక్ సైనికులు సరిహద్దుల్లో స్వీట్లు పంచుకున్నారు. ఈ రోజు (ఆగస్టు 14) పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో ఉన్న అట్టారీ-వాఘా సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు, బీఎస్‌ఎఫ్ సైనికులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. కాగా, అఖండ భారత్ నుంచి స్వతంత్ర దేశంగా 1947, ఆగస్టు 14న పాకిస్థాన్ విడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ కంటే ఒక్కరోజు ముందే పాకిస్థాన్ ప్రజలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు.