పేలుతున్న ఎలక్ట్రిక్ బైక్స్, వాహనదారుల్లో టెన్షన్
21 Apr 2022 జాతీయం 331

కేంద్రం డీజిల్-పెట్రోల్ పై రేట్ల వాయింపుతో దడ పుట్టిస్తోంది. రోజూవారీ వాహనదారుల కష్టాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దీనికి ట్రీట్ మెంట్ అంటూ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది కేంద్రం. ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణ పరిరక్షణ పేరుతో బలవంతంగా ఈవీలను రుద్దుతోంది. అవేమో వరుసగా పేలుతున్నాయి. దాంతో దేశంలో వాహనాదారుల్లో కేంద్రం తీరుపై అసహనం పెరుగుతోంది. 

దేశంలో పలు ప్రాంతాల్లో వరుసగా ఎలక్ట్రిక్‌ వాహనాలు అగ్నికి ఆహుతవడం ఈ మధ్య కామనైంది. నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఆరు ఈవీలు దగ్ధమయ్యాయి. అదీ ఛార్జింగ్ పెడుతుండగా. ఏప్రిల్ 9న మహారాష్ట్ర నాసిక్‌లో ఈవీ బైకులను లోడ్ చేసిన కంటైనర్‌ లో అగ్రిప్రమాదం జరిగింది. జితేంద్ర న్యూ ఈవీ టెక్‌కు చెందిన 20 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. వీటితో పాటు ఓలా ఎలక్ట్రిక్, ప్యూర్ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ దగ్ధమయ్యాయి.  

దీంతో వాహనదారులు ఎలక్ట్రిక్‌ వెహికల్స్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రిక్‌ బైక్స్‌లో వాడే లిథియం ఆయాన్ బ్యాటరీల నిబంధనల్ని సవరిస్తూ కేంద్రం సంచలనం నిర్ణయం తీసుకోనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  ఇదెలా ఉంటే కేంద్రం తీసుకోనున్న ఈ కొత్త నిర్ణయం ఎలక్ట్రిక్‌ వెహికల్‌ తయారీ దారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణుల అంచనా. ప్రస్తుతం ఆటోమొబైల్‌ సంస్థలన్నీ మార్కెట్‌ కాపాడుకోవడం కోసం ఈవీ వెహికల్స్‌ ఉన్న డిమాండ్‌ను బట్టి విపరీతంగా తయారీని పెంచుతున్నాయి. కేంద్రం బ్యాటరీల నిబంధనల్ని సవరిస‍్తే.. కంపెనీలు తయారీ కాకుండా.. భద్రతపై దృష్టిసారించి.. ఉత్పత్తి అనుకున్నంతగా జరగదని నిపుణులు అంటున్నారు. 

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ దగ్ధమవ్వడంపై.. ప్రభుత్వం ఆ వాహనాలను రీకాల్ కు ఆదేశిస్తుందేమోనని ఆశించారంతా. కానీ కేంద్రం ఆ వైపు ఆలోచించడం లేదట. దానికి బదులుగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, DRDO ల్యాబ్‌లల్లో... ఇటీవల జరిగిన ప్రమాదాలపై ఫ్యాక్ట్ చెక్ రిపోర్ట్‌ల కోసం ఎదురు చూస్తోందట. ఓవైపు కేంద్రం వినియోగదారుల భద్రతకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. కానీ వరుసగా జరుగుతున్న ప్రమాదాలు వాహనదారుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ పై కేంద్రం ఖచ్చితమైన చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎనీ వే ఎలక్ట్రిక్ బైకులు వాడే వాహనదారులూ బీ కేర్ ఫుల్. ఛార్జింగ్ పెట్టే టైములో జాగ్రత్త వహించండి. లేదంటే ప్రాణాలకే ప్రమాదంలో పడొచ్చు.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV