దళిత బంధుతో కాంగ్రెస్ ఖతం - డా జిలుకర శ్రీనివాస్
28 Jul 2021 జాతీయం 594

దళితులది ఆర్థిక సమస్యా? సాంఘిక సంస్కరణ సమస్యా? లేదా రాజకీయ సమస్యా? అస్పృశ్యులది సంఘ సంస్కరణ సమస్య అన్నాడు గాంధీ. సవర్ణుల హృదయాల్లో పరివర్తన రావాలని, అస్పృశ్యుల పట్ల ధర్మకర్తల పాత్ర సవర్ణులు  పోషించాలని ప్రతిపాదించాడు ఆయన. అస్పృశ్యుల ఉద్ధరణ కోసం కోటి ఇరవై లక్షలు దేశ వ్యాప్తంగా సేకరించి, వాటిలో ఒక్క రూపాయీ దళితుల ఉద్దరణ కోసం ఖర్చు చేయలేదు. గాంధీ హరిజనోద్ధరణ పచ్చి అబద్దమని బాబాసాహెబ్ అంబేద్కర్ నిరూపించాడు. కాంగ్రెస్ స్వతంత్రం రాక ముందు నుండి దళితులకు వ్యతిరేకంగా పని చేస్తూనే వున్నది. దళితులు అనుభవించే సామాజిక అవమానాలకు, ఆకలి పేదరికానికి, రాజకీయ దాస్యానికి కాంగ్రెస్ మూల కారణం. నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు జరిగింది ఇదే. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అన్నా, నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అన్నా అవేవీ దళితులను బాగు చేయలేకపోయాయి. 

    బిజెపి దృక్పథం కూడా దాదాపు అలాంటిదే.

                                సమాజిక సమసరసత బిజెపి తాత్విక సూత్రం. అంత్యోదయ అనేది ఒక ఆదర్శం మాత్రమే. కుల అంతర్వుల  సామాజిక నిరాణాన్ని కాపాడే విధానాలే ఆ పార్టీ అమలు చేస్తున్నది. దళితులది రాజకీయ సమస్య అని ఆ పార్టీ ఒప్పుకోదు. అంతకుమించి ఎక్కువ ఆ పార్టీ నుండి ఆశించలేము కూడా. అందువల్ల దళితుల అభ్యున్నతికి వాజపేయ హయంలోగానీ, మోదీ హయాంలో గానీ ఆ పార్టీ దళితుల కోసం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన విధానం గానీ పథకం గానీ లేదు. పైగా దళిత విద్యార్థులకు యుజిసి ఇచ్చే ఫెలోషిప్పులను కూడా ఆ పార్టీ ఆపేసింది. అందువల్ల దళితులది ఆర్థిక సమస్య అనో, లేదా రాజకీయ సమస్య అనో ఆ పార్టీ భావించటం లేదు. అవమానం, ఆకలిని భరిస్తూ సమరసతతో దళితులు ఇతరులతో కలిసి బతకాలని ఆ పార్టీ వాంఛిస్తున్నది. 

 

                                   తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కాంగ్రెస్ ను బలహీన పరిచింది. కెసిఆర్ అద్భుతమైన రాజకీయ వ్యూహాలు ఆ పార్టీని నివ్వెర పరచడమే గాక పునాదిని కోల్పోయేలా చేశాయి. రెండు సార్లు గెలిచిన కెసిఆర్, మూడోసారి గెలవడానికి ఒక బలమైన ఎత్తుగడ వేశాడు. అదే దళిత బంధు పథకం. ఆ పథకాన్ని పరిచయం చేస్తూ, దళితులది ప్రధానంగా ఆర్థిక సమస్య అని ఆయన తేల్చేశాడు. దళితులతో జరిగిన అవగాహన సదస్సులో చాలా చక్కని ప్రసంగం చేశాడు. దళితులను సామాజికంగా ఆర్థికంగా చరిత్రలో అణచివేశారని, వాళ్లు పురోగమించాలని ఆయన ఆకాంక్షించాడు. ఆయన మాటల తీయదనం తెలియని వాళ్లు నిజంగానే అబ్బుర పడుతారు. అయితే కెసిఆర్ అవగాహనను మనం అభినందించాలి. గాంధీ, నెహ్రూ, దీన్ దయాళ్ కన్న మెరుగైన దృక్పథాన్ని ఆయన వ్యక్తం చేశాడు. దళితుల ఆర్థిక సాధికారత గురించి ఆయన ఆలోచనలను తోసిపుచ్చ లేము. అవి ఏ మేరకు ఆచరణ సాధ్యం అన్నదే అనుమానాస్పదం తప్ప ఆ పథకాన్ని తృణీకరించాల్సిన అవసరం లేదు. 

 

                            కాంగ్రెస్, బిజెపి, ఇతర పార్టీలు చెబుతున్నట్టు దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ ఉప ఎన్నికలలో గెలవడానికి పెట్టాడని నేను అనుకోను. హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ ను ఓడించడానికి ఇన్ని వేల కోట్లను దళితుల కోసం వెచ్చించడానికి కెసిఆర్ సిద్ధపడేంత అపరిణత రాజకీయ నాయకుడు కాడు. అక్కడ ఓడినా, అతనికి ఒరిగే నష్టం ఏమీ లేదు. కెసిఆర్ ది దూర దృష్టి. ఒకే దెబ్బకు అనేక పార్టీలను నేల కూల్చే ఎత్తుగడ తనది. 

 

                           నిజానికి దళితుల భుజాల మీద తుపాకీ పెట్టి తను కాలుస్తున్నది ఈటెల రాజేందర్ ను కాదు. కొత్తగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించబడిన రేవంత్ రెడ్డిని. అవును. ఈ సంగతిని కొద్దిగా లోతుగా అర్థం చేసుకుందాం. 

                         2018 ఎన్నికలలో కాంగ్రెస్ కు 28.4% శాతం వాలిడ్ ఓట్లు వచ్చాయి. టిఆర్ఎస్ పార్టీ కి 46.9% ఓట్లు వచ్చాయి. బిజెపికి 7.1% ఓట్లు లభించాయి. బిజెపికి ఇప్పుడు బహుశా ఒక పది శాతం ఓట్లు ఉన్నాయని అనుకుందాము. దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచింది కాబట్టి, హైదరాబాదు జిహెచ్ఎంసి ఎన్నికలలో నలభైకి పైగా కార్పోరేటర్లను గెలిచింది కాబట్టి మరో మూడు శాతం ఓట్లు అదనంగా కలపొచ్చు. టిఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అవుతుంది కానీ బిజెపి కాలేదు. బిజెపికి తెలంగాణ అగ్రకులాలు వెన్నుదన్నుగా ఉన్నారు.‌ ఇప్పుడు మున్నూరు కాపులు ఆ పార్టీని ఓన్ చేసుకుంటున్నారు. ముదిరాజులలో ఒక వర్గం కూడా ఆ పార్టీ ని బలపరుస్తుంది. కానీ రేవంతు రెడ్డి కాంగ్రెస్ బాధ్యత తీసుకోగానే, బిజెపి వైపు చూసే రెడ్డి, కాపు కులాలు ఆగిపోయాయి. వాళ్లంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అనుకుంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ కి సంప్రదాయ ఓటు పునాది ఉంది. రెడ్లు, కాపులు, దళితులు, ముస్లింలు, గిరిజనులు ఆ పునాది. లంబాడీ తండాలను పంచాయతీలు చేసి, కెసిఆర్ లంబాడీలను తన పునాదిగా మార్చుకున్నాడు. ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి, ఓవైసి పార్టీతో సఖ్యత నెరిపి ముస్లింలను తన వైపు ఆకర్షించాడు. కానీ గ్రామీన ముస్లిం ఓటర్లు ఇప్పటికీ కాంగ్రెస్ వెనకే వున్నారు. బిసిలు ఒకప్పుడు టిడిపికి పునాదిగా వుండే వాళ్లు. కానీ కెసిఆర్ సోషల్ ఇంజనీరింగ్ చేశాడు. అరవైశాతం బిసి కులాల ఓట్లను పొందాడు. ఇప్పటికీ ఆ పునాది అలాగే వుంది. కాంగ్రెస్ వైపు అంత తేలికగా ఆ కులాలు పోయేలా లేవు. కాబట్టి కాంగ్రెస్ అనేది రెడ్డి, దళితుల పార్టీగా వున్నది. 

 

                         రేవంత్ రెడ్డి సారధ్యంలో ని కాంగ్రెస్ ను ఓడించాలంటే దళితులను తన వైపు ఆకర్షించాలని కెసిఆర్ యోచిస్తున్నాడు. కాంగ్రెస్ కు పోలైన 28.4% శాతం ఓట్లలో 23% దళితుల ఓట్లన్నది నిజం. హుజూరాబాద్ లో 63,000 ఓట్లు వచ్చాయి. అవి కౌషిక్ రెడ్డి నాయకత్వం వల్ల వచ్చినవి కావు. హుజురాబాద్ దళితుల ఓట్లు యాభై వేలున్నాయి. రమారమి నలభై ఐదు వేల ఓట్లయినా దళితులు కాంగ్రెస్ కు వేసి వుంటారు. ఆ ఓట్లు బిజెపికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పడేవి కావు. ఇప్పుడు టిఆర్ఎస్ కు ముదిరాజులు,  మున్నూరు కాపులు దూరమయ్యారు కాబట్టి, ఆ లోటును దళితుల ఓట్లతో పూడ్చాలని కెసిఆర్ ఆలోచన కావొచ్చు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ని బలహీనం చేయాలంటే దళితుల ఓట్లను తన వైపు మార్చు కోవాలని ఆయన తలంపు. ఈ చక్ర వ్యూహాన్ని ఛేదించటం రేవంత్ రెడ్డి కి అంత సులువేమీ కాదు. రేవంత్ రెడ్డి తన పార్టీ పునాదిని కాపాడుకోవడానికి దళిత బంధు కన్నా మంచి పథకాన్ని ప్రతిపాదిస్తాడా తెలియదు. 

 

                        శ్రీ కృష్ణ కమిషన్ ప్రకారం దళితులు ఇరవైశాతంకు పైగా వున్నారు. కెసిఆర్‌ తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే చేశాడు. ఆ సర్వే ప్రకారం దళితులు 18% శాతం వున్నారు. అంతేకాదు, తెలంగాణలో అధికారం కావాలని ప్రయత్నిస్తున్నారు. నాయకత్వం లేని సమాజంగా వాళ్లు ఉన్నారు. పార్టీలేని సమూహంగా కూడా వున్నారు. దళిత రాజకీయాలకు అవకాశం దండిగా వున్నది. కెసిఆర్ పాలన మీద తీవ్రమైన అసంతృప్తి కూడా దళితులలో వున్నది. ఉదారవాద ఆర్థిక విధానాల వల్ల దళితుల కుటుంబ వ్యవస్థ అనేక ఆటుపోట్లకు లోనవుతున్నది. ఈ దుస్థితిని ఆసరగా చేసుకొని, దళిత బంధు పథకం ప్రవేశ పెట్టాడు. ఈ దెబ్బతో దళిత రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తున్న శక్తులను తేలికగా దెబ్బ కొట్టగలిగాడు.  ఆర్థిక సహాయం అనేది నయా ఉదారవాద ఆర్థిక విధానాలు విసిరే ఒక విషవలయం‌. నగదు బదిలీ పథకానికి మరో రూపం ఇది. దళితుల జీవితాలలో సారభూతమైన మార్పు ఈ పథకం తేలేదు గానీ కాంగ్రెస్, దళిత రాజకీయ పార్టీలను మాత్రం ఇది విరిచేయగలదు. 

 

                      కెసిఆర్ భావించినట్టు దళితులది ఆర్థిక సమస్య మాత్రమే కాదు. డా. అంబేద్కర్ చెప్పినట్టు రాజకీయ సమస్య. నిజంగా కెసిఆర్ దళిత సాధికారత కోరేవాడే అయితే, ప్రతి ఎస్సీ కాలనీని గ్రామ పంచాయతీ చేయాలి. అప్పుడు మాత్రమే దళితుల పురోభివృద్ధి సాధ్యమవుతుంది. కాంగ్రెస్ నో దళిత రాజకీయాలనో లేకుండా చేయడానికి పైపై మెరుగుల ప్రయత్నాలు చేస్తే, వాటి వల్ల ఎలాంటి ఫలితం వుండదు. కనీసం చరిత్రలో గొప్ప సంస్కర్తగా తనను కీర్తించే అవకాశం కూడా వుండదు.

 

-డా.జిలుకర శ్రీనివాస్

 వ్యవస్థాపక అధ్యక్షుడు

ద్రవిడ బహుజన సమితి

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV