హుజూరాబాద్ బరిలో బీఎస్పీ.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం!
అవినీతి ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి తొలగించబడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉద్యమ కాలం నుంచి వెన్నంటి ఉన్న సహచరుడే గులాబీ దళపతిని నిలదీస్తూ బీజేపీ నుంచి పోటీ చేస్తుండడంతో హుజూరాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. ఈటల రాజేందర్‌కి వ్యతిరేకంగా అధికార టీఆర్‌ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. మరోవైపు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకంతో నూతన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దించాలని యోచిస్తోంది.
అవన్నీ అటుంచితే.. తాజాగా.. హుజూరాబాద్ బరిలో బీఎస్పీ దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయాలంటూ పలువురు బీఎస్పీ నేతలు ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు బీఎస్పీలో చేరుతుండగా.. ఈ సందర్భంగా నిర్వహించే సభలో ఆయన హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ అంశంపై తన నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం.
కాగా, బహుజన రాజ్యాధికారం వస్తేనే తెలంగాణలో బీసీలకు న్యాయం జరుగుతుందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా బీసీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్‌లో ఖర్చు చేస్తున్న రూ.2వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఓట్ల కోసం తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. బీసీలు, బీసీ ఉపకులాల వర్గాలు ఐక్యమై తమ హక్కులను సాధించుకోవాలని ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు.