టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేలా బీజేపీ దిమ్మతిరిగే ప్లాన్.. రంగంలోకి పెద్దాయన!
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈనెల 17న ఆయన రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు నిర్మల్‌లోని వెయ్యి ఊడల మర్రి వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సెప్టెంబర్ 17నాటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్‌కు చేరుకునేలా నేతలు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు పాదయాత్రతో పాటు బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, అమిత్ షా తెలంగాణ పర్యటనపై రేపు రాష్ట్ర నాయకులతో బీజేపీ అధిష్ఠానం చర్చించే అవకాశం ఉంది. అనంతరం అమిత్ షా పర్యటనపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. నిర్మల్ సభతో పాటు కామారెడ్డి సభకు అమిత్ షా హాజరయ్యేలా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.
ఇక నిర్మల్ లోని వెయ్యి ఊడల మర్రి చరిత్ర విషయానికొస్తే.. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని రజాకార్లు మర్రి చెట్టు వద్ద ఊచకోత కోశారు. దీంతో కాలక్రమంలో వెయ్యి ఊడల మర్రిగా ప్రసిద్ధి చెందింది. ఆనాడు సంప్రదాయక ఆయుధాలపై ఆధారపడి పోరాటానికి దిగిన ఆదివాసులు ఆధునిక ఆయుధాలు, తుపాకుల ముందు నిలువలేకపోయారు. తెగించి పోరాడుతున్న ఆదివాసులను రజాకార్లు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. కడదాకా పోరాడిన 1000 మందిని పట్టుకొని నిర్మల్ నడిబొడ్డున ఉన్న 'ఊడల మర్రి' చెట్టు కు ఏప్రిల్ 9న ఉరితీశారు. ఆ మర్రిచెట్టు లేకపోయినా, దాని స్థానంలో స్తూపాన్ని నిర్మించారు.