టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేలా బీజేపీ భారీ వ్యూహం.. ఈసారి దెబ్బ మాములుగా ఉండదు..!
25 Aug 2021 జాతీయం 521

టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేలా బీజేపీ భారీ వ్యూహం.. ఈసారి దెబ్బ మాములుగా ఉండదు..!

హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రత్యర్థులు ఎత్తుకు పైఎత్తులతో రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది.ప్రస్తుతానికి ఇక్కడ టీఆర్‌ఎస్‌–బీజేపీల మధ్య ద్విముఖ పోరే నడు స్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఇంకా తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనప్పటికీ.. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేసుకుంది.  ఇటీవల శాలపల్లిలో జరిగిన సీఎం కేసీఆర్ సభతో గులాబీ నేతల్లో జోష్‌ పెరగగా.. కమలనాథుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు బీజేపీ నేతలు యాత్రలు షురూ చేశారు. ఈ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ప్రచారంలో ఎక్కడా  తగ్గవద్దని, మరింత పట్టుబిగించాలని అధిష్టానాలు ఆదేశించాయి.

కాగా, హుజురాబాద్‌లో గెలుపును కుల సమీకరణాల నిర్ణయించే పరిస్థితి నెలకొనడంతో ఆయా కులాల ఓటర్లను ఆకట్టుకునేందుకు  టీఆర్ఎస్, బీజేపీ నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టేందుకు బీజేపీ  మాస్టర్ ప్లాన్  వేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయా కులాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఈటల రాజేందర్ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే  బీజేపీ అధిష్టానం  మరో కీలక నిర్ణయం తీసుకుంది.

మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయను హుజురాబాద్ ప్రచార బరిలో దింపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 26న బండారు దత్తాత్రేయకు జమ్మికుంటలో ఆత్మీయ సత్కారం చేయనున్నట్లు మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ తెలిపారు. పార్టీలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గొల్ల కుర్మలందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆమె పిలుపునిచ్చారు. గులాబీ దళం జోరుకు కళ్లెం వేసేందుకే  బీజేపీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV