ఆదిలాబాద్ లో మారుతున్న కాంగ్రెస్ రాజకీయం...
25 May 2022 తెలంగాణ 317

పిట్ట పోరు పిల్లి తీర్చిందని సామెత. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇపుడు దీన్నే నమ్ముకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరికలతో సీనియర్ల అధిపత్య పోరుకు చెక్ పెడుతున్నాడట రేవంత్. ముఖ్యంగా సీనియర్ల అధిపత్య పోరుతో సతమతమవుతున్న రేవంత్... కొత్త ఎత్తులేస్తున్నట్టు కనిపిస్తోంది. దీనికి ఎగ్జాంపులే ఆదిలాబాద్ కాంగ్రెస్ రాజకీయం. నల్లాల ఓదేలు చేరికతో ఉమ్మడి అదిలాబాద్ లో భారీగా రాజకీయ మార్పులు రాబోతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఉంటూ ఆ పార్టీకి ఏకు మేకులా తయారైన ప్రేమ్ సాగర్ రావుకు చెక్ పెట్టే దిశగా రేవంత్ పావులు కదిపినట్టు సమాచారం. 

 

మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీ నుంచి బాల్క సుమన్... కాంగ్రెస్ లో ప్రేమ్ సాగర్ రావుదే హవా. ఆ మాటకొస్తే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోనే సీనియర్ ప్రేమ్ సాగర్ రావు. అదిలాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్ని శాసిస్తూ వచ్చారాయన. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి హైకమాండ్ పెద్ద పదవి ఇవ్వడంతో ప్రేమ్ సాగర్ అధిపత్యానికి గండి పడింది. ఏలేటికి పదవి దక్కిన తర్వాత ఇద్దరి మధ్య పోరులో జిల్లా కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఏలేటిని హైకమాండ్ కంట్రోల్ చేస్తున్నా... ప్రేమ్ సాగర్ రావు ధిక్కార స్వరం పార్టీకి చికాకు తెప్పిస్తోంది. మాట్లాడితే ఉత్తర తెలంగాణలో ఇందిరా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ పెడతానని పలుమార్లు బెదిరించారాయన. ఇన్నాళ్లు కాంగ్రెస్ అధిష్టానం చూసీ చూడనట్టు వదిలేసింది. రేవంత్ సైతం ప్రేమ్ సాగర్ ని స్మూత్ గా డీల్ చేసే ప్రయత్నం చేశాడు. 

 

అయితే నల్లాల ఓదేలు చేరికతో మంచిర్యాలతో పాటు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు ఊపొచ్చింది. జిల్లాలో సీనియర్ నేత అయిన ప్రేమ్ సాగర్ రావుకు తెలియకుండా నల్లాల ఓదేలు చేరిపోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సీన్ లో ప్రేమ్ సాగర్ రావు ఎక్కడా కనిపించలేదు. ఆ టైంలో ఆయన అదిలాబాద్ లోనే ఉన్నారట. తనకు తెలియకుండా ఓదేలు చేరిపోవడంతో రగిలిపోతున్నారని సమాచారం.

 

ఇకపోతే నల్లాల ఓదేలు భార్య జెడ్పీ ఛైర్ పర్సన్ హోదాలో పార్టీలో చేరారు. ఓదేలు రెండుసార్లు ఎమ్మెల్యే. సో మంచిర్యాల జిల్లాలో ఓదేలు దంపతులతో ప్రేమ్ సాగర్ రావును రీప్లేస్ చేయాలన్నది రేవంత్ వ్యూహమట. మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రావు భార్య కొక్కిరాల సురేఖ. ప్రేమ్ సాగర్ రావు తోక కత్తిరించేందుకు ఓదేలు భార్య భాగ్యలక్ష్మిని డీసీసీ ప్రెసిడెంట్ గా నియమించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నల్లాల ఓదేలు చేరికతో అటు బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్, ఖానాపూర్, కాగజ్ నగర్, మంచిర్యాల సెగ్మెంట్లలో సమీకరణలు మారే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానాల్లో ప్రేమ్ సాగర్ రావు అధిపత్యమే నడిచేది. నల్లాల ఓదేలుతో ప్రేమ్ సాగర్ రావు అధిపత్యానికి చెక్ పెట్టినట్టే అన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. చూడాలి మరి ప్రేమ్ సాగర్ రావు భవిష్యత్తు వ్యూహమేంటో ?

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV