ధరణి పోర్టల్. దేశంలోనే ది బెస్ట్ రెవిన్యూ మోడల్ అని గప్పాలు కొట్టుకుంటుంది అధికార పార్టీ. అదో దరిద్రం అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. అలాంటి ధరణి ఇపుడు రాజకీయ రంగు పులుముకుంది. అధికారంలోకొస్తే ధరణిని రద్దు చేసే మరో కొత్త రెవిన్యూ వ్యవస్థను తీసుకొస్తామని హామీ ఇచ్చింది. వరంగల్ డిక్లరేషన్ లో అదే హైలైట్. దాంతో ఇపుడు అన్ని రాజకీయ పక్షాలకు ధరణి అస్త్రంగా మారింది. ఊరూ-వాడా తిరుగుతున్న నేతలు ధరణి బాధితులే టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నారు.
ధరణి పోర్టల్ ను తీసుకొచ్చి ఏడాదిన్నర గడుస్తోంది. ఆ పోర్టల్ లోని లోపాలను సరిచేసేందుకు ఇప్పటికి రెండు కమిటీలను వేసింది కేసీఆర్ సర్కారు. ఎన్నోసార్లు కేసీఆర్ సమీక్ష చేశారు. దాన్ని పర్యవేక్షిస్తున్న సీఎస్ సోమేష్ కుమార్ మరెన్నోసార్లు అధికారులను ఆదేశించారు. అయినా ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదు. తెలంగాణలో 60 లక్షల మంది రైతుల భూ రికార్డులు, వారి జాతకాలు ధరణిలో నిక్షిప్తమై ఉన్నాయి. అలాంటి పోర్టల్ ని ఓపెన్ చేస్తే బగ్స్ విపరీతంగా కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే ధరణిని ఈజీగా హ్యాక్ చెయ్యొచ్చు అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అన్యాక్రాంతమై ఉన్న భూములను అధికార పార్టీ నేతలు కబ్జా పెట్టారని ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణలే. టీఆర్ఎస్ నేతల భూదాహానికి ధరణి అడ్డాగా మారిందన్న విమర్శలున్నాయి. నేతల అవినీతి సంగతి పక్కనపెడితే ఓనర్ షిప్ హక్కులను కోల్పోయి.. డిస్ప్యూట్స్ ఎదుర్కొంటున్న బాధితులు తెలంగాణలో లక్షల్లో ఉన్నారు. దాంతో ధరణి కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతుండటం విశేషం.
ఊళ్లల్లో ధరణి సమస్యలపై రచ్చబండ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. పేదల భూములు, అసైన్డ్ భూములను చెరబట్టేందుకే అధికార పార్టీ తీసుకొచ్చిన అంకుశం ధరణి అని బీజేపీ విమర్శలు చేస్తోంది. దీంతో ధరణి పోర్టల్ సెంట్రిక్ గా రాజకీయాలు జరుగుతున్నాయి. నిజానికి ఇన్నాళ్లు రాజకీయ పార్టీలేవీ దీనిపై ఫోకస్ చేయలేదు. బాధితులే ఓ వేదికగా ఏర్పడి సోషల్ మీడియాలో గ్రూపులు క్రియేట్ చేసి ఫైట్ చేస్తూ వచ్చారు. దాంతో ధరణి లోపాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. ఇపుడవే పార్టీలకు అస్త్రాలుగా మారాయి. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారడంతో... కేసీఆర్ సర్కారు అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు సీఎస్ సోమేష్ కుమార్ ను కేసీఆర్ హెచ్చరించినట్టు కథనాలొచ్చాయి. ధరణి కారణంగా సోమేష్ ను సాగనంపేందుకు కేసీఆర్ సిద్ధమైనట్టు సెక్రెటేరియట్ వర్గాలు గుసగుసలాడుకున్నాయి. ఇపుడు రాజకీయ కోణం తీసుకోవడంతో... కేసీఆర్ ఏం చేస్తారోనన్న ఆసక్తి మొదలైంది. చూడాలి మరి ధరణిని సెట్ రైట్ చేస్తారా ? లేక అలాగే గాలికొదిలేస్తారా ?