కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. బుధవారం బ్రేకింగ్ న్యూస్ ఇది. సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని చోట్ల కనిపించిన వార్త. నిజానికి అధికారికంగా హస్తం పార్టీ అలాంటి ప్రకటనేది చేయలేదు. కానీ పీకే కాంగ్రెస్ లో చేరడం, ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడం ఖాయమని కీలక నేతల నుంచి మనకున్న సమాచారం.
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియగాంధీతో ప్రశాంత్ కిషోర్ వరుసగా భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. బుధవారం కూడా దాదాపు ఆరు గంటల పాటు కాంగ్రెస్ హైకమాండ్ తో సుధీర్ఘ చర్చలు జరిపారట పీకే. దీంతో ఆయన పార్టీలో చేరడం ఖాయమైందని, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.
ఎన్నికల నిర్వహణ, వ్యూహరచన, పొత్తుల ఖరారు బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశం ఉందట. పార్టీ పునరుజ్జీవం, ప్రశాంత్ కిషోర్ చేరిక, తదితర అంశాలపై రాహుల్, కుమార్తె ప్రియాంకతో కీలక చర్చలు జరిపారట పీకే. అనంతరం సీనియర్ నేతలు కమల్‌నాథ్, జైరాం రమేశ్, కేసీ. వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్, రణదీప్ సూర్జేవాలాతోనూ భేటీ అయ్యారట.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిని, రాష్ట్రాల వారీగా అవలంబించాల్సిన వ్యూహాలను పార్టీ నేతలకు ప్రశాంత్ కిషోర్ వివరించినట్లు తెలిసింది. ఆయన సలహాలు, సూచనలపై ఈ నేతలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సోనియాకు కార్యాచరణను సూచిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నేతల నివేదిక మేరకు ప్రశాంత్ కిషోర్‌కి అప్పగించాల్సిన బాధ్యతలు, పదవి గురించి సోనియా ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మొత్తమ్మీద మోడీని కొట్టాలంటే పీకేనే కరెక్ట్ అనుకుంటున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ. దానికి తగ్గట్టే పీకే కార్యచరణ కూడా అమలవుతోంది. గత కొన్ని నెలలుగా దేశంలోని కీలక ప్రాంతీయ పార్టీ నేతలతో వరుసగా సమావేశమవుతూ వస్తున్నాడు పీకే. యూపీఏ కూటమికి పీకేనే రూట్ మ్యాప్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. కాంగ్రెస్ ఖతమైతున్న పరిస్థితిలో పీకేను నమ్ముకున్న ఆ పార్టీ ఏ తీరాలకు చేరుతుందో చూడాలి మరి