పొలిటికల్ బేహారీ, దేశ రాజకీయాలను భ్రష్టు పట్టించిన ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు సంచలన ప్రకటన చేశాడు. ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. బీహార్ నుంచే తన పొలిటికల్ జర్నీని మొదలుపెట్టబోతున్నాడట.
దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ప్రజాస్వామ్యం గురించి పీకే మాట్లాడటం విడ్డూరం. ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిని అయి, ప్రజానుకూల విధానాల రూపకల్పనలో సాయం చేయడంలో పదేళ్లు రోలర్ కోస్టర్ లా గడిచిపోయాయన్నాడు పీకే. ఇపుడు నేరుగా ప్రజలకు చేరువ కావాల్సిన టైమొచ్చిందని సమర్థించుకున్నాడు. జనం సమస్యల్ని అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సిన సమయమొచ్చిందన్నాడు. దీనికి ఆరంభం బీహార్ నుంచేనని ప్రకటించాడు. పార్టీ పేరు జన్ సూరజ్ గా హింట్ ఇచ్చాడు.
ఇకపోతే పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడని చాలా రోజులుగా నడుస్తున్న చర్చే. గత నెల కాంగ్రెస్ ముఖ్యులతో వరుస భేటీలు నిర్వహించాడు. కాంగ్రెస్ సుప్రీం సోనియాతో వరుసగా మూడుసార్లు భేటీ అయ్యాడు. దాంతో పీకే కాంగ్రెస్ లో చేరడం ఖాయమన్న ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ తో సమావేశం తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ కు హ్యాండిచ్చాడు పీకే. దాంతో కాంగ్రెస్ ఊపిరిపీల్చుకుంది. పీడా వదిలిందని ఫీల్ ఫ్రీ అయింది.
ఇపుడు పార్టీ ప్రకటనతో పీకే ఏం చేయబోతున్నారన్న కొత్త చర్చ స్టార్టైంది. నితీష్ కుమార్ ప్రియ శిష్యుడిగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన పీకేను... తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. అయితే నితీష్ నే మింగేయాలని చూశాడు పీకే. అది గమనించి జేడీఎస్ పీకేను తన్ని తరిమేసింది. పీకే లేకుండానే నితీష్ బీహార్ లో మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఆ కసితోనే బీహార్ నుంచి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి పీకే మేకవుతాడా ? లేక బీజేపీ ఆటలో పావుగా మారతాడా ?