హైదరాబాద్: ''బాహుబలి" తర్వాత ప్రభాస్ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. జాతీయ, అంతర్జాతీయ అభిమానులను సంపాదించుకోవడమే కాదు, పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రభాస్ అభిమానులు గర్వంగా ఫీలయ్యే ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న 'ఆదిపురుష్' సినిమా కోసం ఏకంగా రూ.150 కోట్లను అందుకోనున్నాడని సమాచారం. ఒక సినిమాకు ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్న తొలి ఇండియన్ హీరో ప్రభాసే. సందీప్ రెడ్డి వంగతో చేస్తున్న ''స్పిరిట్" చిత్రానికి ప్రభాస్ కి ఇదే స్థాయి రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు అంగీకరించారని తెలిసింది. ఇది వరకు వంద కోట్లకు పైగా పారితోషికం అందుకున్న నటులు ఇద్దరే. 'సుల్తాన్', "టైగర్ జిందా హై" చిత్రాలకు సల్మాన్ ఖాన్, "బెల్ బాటమ్" సినిమా కోసం అక్షయ్ కుమార్ గతంలో రూ. 100 కోట్లు తీసుకున్నారు. దీంతో బాలీవుడ్ హీరోలను సైతం మించిపోయి ప్రభాస్ దేశంలోనే నెం.1 స్టార్ అయ్యాడని అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. నాగ్ అశ్విన్ తో చేస్తున్న "ప్రాజెక్ట్ కె" సినిమాకి ప్రభాస్ పారితోషికం రూ.200 కోట్లకు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని బాలీవుడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన "రాధేశ్యామ్" ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఆ సినిమా విజయం సాధిస్తే ప్రభాస్ స్టార్ డమ్ మరింత పెరిగే అవకాశం ఉంది.