పాలమూరు రాజకీయాల్లో కీలక మలుపు లాంటి స్టోరీ ఇది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా ఓ ఉద్యమకారుడు బరిలో దిగబోతున్న సెన్సేషన్. కేసులతో వేధిస్తూ.. నిత్యం వెంటాడుతున్న మంత్రి అధికారాన్ని సవాల్ చేస్తూ ఉద్యమకారుడు ఎన్నికల బరిలో నిలవబోతున్నాడు. అతనే మున్నూరు రవి.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారుల్లో మున్నూరు రవి ఒకరు. కేసీఆర్ అభిమాన సంఘం పేరుతో ఓ సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు మున్నూరు రవి. ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచిన అతికొద్ది మందిలో ఒకడు మున్నూరు రవి. పాలమూరుకు చెందిన మున్నూరు రవిపై ఎన్నో కేసులు బుక్ అయ్యాయి. రైళ్లను అడ్డగించిన కేసులు, అధికారుల్ని కొట్టిన కేసులతో సహా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఆస్థుల ధ్వంసం చేసిన ఘటనల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత అన్ని కేసులు ఎత్తేసింది కేసీఆర్ సర్కారు. అయినా కేంద్రప్రభుత్వం పెట్టిన కేసులు మాత్రం అలాగే ఉన్నాయి.
కేసుల సంగతి పక్కనపెడితే మహబూబ్ నగర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో మున్నూరు రవికి మధ్య తీవ్ర విబేధాలొచ్చాయి. దాంతో శ్రీనివాస్ గౌడ్ టార్గెట్ గా మారాడు మున్నూరు రవి. రీసెంట్ గా మంత్రిపై హత్యాయత్నం కేసులో రవిని అరెస్ట్ కూడా చేశారు. ఆ కేసులో పోలీసుల ఛార్జీషీట్ పలు అనుమానాలకు తావిచ్చింది. స్వయంగా సీఎం కేసీఆర్-మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సయోధ్యకు కృషి చేశారు. దాంతో వివాదం సద్దుమణిగింది.
అయితే తనను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా పోటీ చేయాలని మున్నూరు రవి ఆలోచనగా తెలుస్తోంది. స్థానికంగా మంత్రిపై తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు చెప్తున్నాయి. స్వయంగా శ్రీనివాస్ గౌడే స్థాన చలనం కోరుకుంటున్నారన్న ప్రచారమూ ఉంది. శ్రీనివాస్ గౌడ్ ఖాళీ చేస్తే కారు గుర్తుపై పోటీ చేయాలని.. లేకపోతే ఇండిపెండెంట్ గానైనా బరిలో దిగాలని రవి డిసైడైనట్టు మనకున్న సమాచారం. పాలమూరులో ప్రతీ గ్రామంలో అనుచరులున్న రవి... తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశాడు. తన సామాజిక వర్గం ఓట్లే 14 వేలకు పైగా ఉన్నాయి. పైగా ఉద్యమకారునిగా నియోజకవర్గానికి సుపరిచితుడు కావడంతో పాలమూరు ప్రజలు తనను ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నాడతను. మున్నూరు రవి ఎంట్రీతో పాలమూరు పోరు ఆసక్తికరంగా మారడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో.