మల్కాజ్ గిరి ఎంపీ సీటు కాంగ్రెస్ లో హాట్ కేకులా మారిందిప్పుడు. ఆ స్థానంలో ప్రాతినిధ్యం వహిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం. ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటు ఎల్బీ నగర్, కల్వకుర్తి లాంటి నియోజకవర్గాలపై రేవంత్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రేవంత్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేస్తే.. మల్కాజ్ గిరి ఎంపీ సీటు ఖాళీ అవుతుంది కదా. ఆ సీటులో పోటీ చేసేదెవరు ?
రేవంత్ ఖాళీ చేయబోయే సీటు కోసం కాంగ్రెస్ సీనియర్లు కొందరు తమ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. మల్కాజ్ గిరి సీటు కోసం హైకమాండ్ ను కాకాపడుతున్న నేతల లిస్టు పెరుగుతోందని సమాచారం. దానికోసం రేవంత్ తోనూ లాబీయింగ్ చేస్తున్నారట. ఆ సీటు కోసం మొదటగా వినిపిస్తున్న పేరు మధుయాష్కీ గౌడ్. నిజామాబాద్ లో కవిత-ధర్మపురి అరవింద్ దూకుడు రాజకీయాలతో మధు యాష్కీ వెనకబడిపోయారు. ఇందూరులో ఆయన ఉనికి ప్రశ్నార్థకమైంది. దాంతో ఆయన స్థానచలనం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో మధుయాష్కీ గౌడ్ కు మల్కాజ్ గిరి ఎంపీ సీటు ఆశాకిరణంలా మారింది. రాహుల్ తో తనకున్న సంబంధాలకు తోడు రేవంత్ ను కాకపడుతున్నట్టు తెలుస్తోంది. ఎల్బీ నగర్ పరిధిలో నివాసముండే మధు యాష్కీ గౌడ్ మల్కాజ్ గిరిని సొంత నియోజకవర్గంలా భావిస్తున్నారట. ఇప్పటికే పార్టీలో కొందరితో ఆ సీటు నాదే అని ప్రచారం చేసుకుంటున్నారట కూడా. దాంతో యాష్కీకి హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందేమోనన్న చర్చ జరుగుతోంది.
ఇకపోతే గతంలో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ఎంపికైన సర్వే సత్యానారాయణ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారట. గతంలో ఈ నియోజకవర్గం నుంచి పనిచేసిన అనుభవం, బలం-బలగం ఉన్నాయని.. తనకిస్తే గెలిచి వస్తానని చెప్పుకుంటున్నారట. ఇక మరో సీనియర్ వీ హనుమంత రావు సైతం మల్కాజ్ గిరి బరిలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారట. అంబర్ పేటలో తనకు ఛాన్స్ లేదన్న నిర్ణయానికొచ్చిన హన్మంతు.. మల్కాజ్ గిరి కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారని సమాచారం. హైకమాండ్ వద్ద తనకున్న పరపతిని ఉపయోగించి వేడుకుంటున్నారట. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నడూ గెలవని వీహెచ్... లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట.
ఇకపోతే రేవంత్ కోటరీలో కీలకంగా పనిచేసే సింగిరెడ్డి హరివర్థన్ రెడ్డి సైతం మల్కాజ్ గిరిపై కన్నేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోరు తప్పదు. దాంతో మల్కాజ్ గిరి బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థిపై ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. 2024లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు టైమున్నా ఇప్పటి నుంచే ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటుండటం ఆసక్తి రేపుతోంది. చూడాలి మరి మల్కాజ్ గిరికి ఎవరికి దక్కుతుందో ?