కేఏ పాల్ కు హైకోర్టులో చుక్కెదురు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడులను ఉప సంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్మికులు ఆందోళన చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా కేంద్రాన్ని తప్పుబట్టారు. అంతేకాదు.. కోర్టు మెట్లు కూడా ఎక్కారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు పాల్.
తన పిటీషన్ లో కేంద్ర గనులు ఉక్కు శాఖ కేంద్ర ఆర్థిక శాఖ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీ సీఎస్ ను ప్రతివాదులుగా చేర్చారు. సోమవారం ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. అమెరికాలో ఉండి పిల్ ఎలా దాఖలు చేశారని కేఏ పాల్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.
దానికి.. జీపీఏ ద్వారా పిల్ దాఖలు చేశామని న్యాయవాది చెప్పారు. దీంతో.. జీపీఏ ద్వారా ఎలా దాఖలు చేస్తారని కోర్టు మళ్లీ ప్రశ్నించింది. ఆ తర్వాత వాదనలు కొనసాగాయి. న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించగా.. కేఏ పాల్ తరఫు న్యాయవాది సమాధానాలు ఇచ్చారు. కానీ.. న్యాయస్థానం వాటితో సంతృప్తి చెందకపోవడంతో పాల్ పిటిషన్ ను కొట్టివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV