ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు దశాబ్దాలుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఇలాంటి తరుణంలో గుజరాత్ కాంగ్రెస్ కోలుకోలేని ఎదురుదెబ్బ. పటిదార్ కమ్యూనిటీ యువ నేత హర్ధిక్ పాండ్యా కాంగ్రెస్ కు రాజీనామా చేశాడు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ సుప్రీం సోనియాకు లేఖ రాశాడు. ఎంతో ధైర్యం చేసి కాంగ్రెస్ పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఈ నిర్ణయాన్ని నా సహచరులు, గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని అనుకుంటున్నా. ఈ అడుగుతో రాబోయే రోజుల్లో గుజరాత్ కోసం సానుకూలంగా పనిచేసే అవకాశం లభిస్తుందని నమ్ముతున్నా. '' అని హార్దిక్ పటేల్ ట్వీట్ చేశాడు.
గతంలో పటీదార్ ఉద్యమానికి నాయకత్వం వహించి, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన హార్దిక్ పటేల్.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అప్పట్లో ఆయనకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది హస్తం పార్టీ. 2020లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. కానీ ఇప్పుడు ఎవరూ తనను పట్టించుకోవడం లేదని హార్దిక్ పటేల్ ఆవేదన. పటిదార్ కమ్యూనిటీలో బలమైన నేతగా పేరున్న తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తి హార్ధిక్ ది. దాంతో కొన్ని రోజులుగా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ వచ్చాడు. పెళ్లికి ముందు బలవంతంగా వేసక్టమీ చేయించిన వరుడిలా తన పరిస్థితి తయారైందని సంచలన వ్యాఖ్యలు చేశాడు హర్ధిక్. అప్పటి నుంచే కాంగ్రెస్ ను వీడుతాడన్న ప్రచారం జరిగింది.
కాంగ్రెస్ ఇటీవల నిర్వహించిన చింతన్ శివిర్ లో గుజరాత్ పీసీసీ హోదాలో ఒక రోజు ఆలస్యంగా వచ్చాడు హార్థిక్ పటేల్. రెండు రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో రెండో రోజు మాత్రమే పాల్గొన్నాడు. అది కూడా అంటీముంటనట్టుగానే. ఆ తర్వాత పటిదార్ ముఖ్యనేత నరేష్ పటేల్‌ను కలిశాడు. రాజకీయాల్లో వేగంగా అడుగులు వేయాల్సి ఉంటుందని నరేష్ పటేల్ ఇచ్చిన సలహాతో... కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాడు హార్థిక్. త్వరలో బీజేపీలో చేరతాడన్న ప్రచారం జరుగుతోంది. ఓ వైపు ఆప్ గుజరాత్ పై ఫోకస్ పెట్టింది. చీపురు పార్టీ కన్నుపడిన చోట కాంగ్రెస్ కనుమరుగవుతోంది. ఢిల్లీ, పంజాబ్ లో జరిగిందదే. అదే సెంటిమెంట్ గుజరాత్ లో రిపీటవుతుందా ? హార్ధిక్ రూపంలో గుజరాత్ కాంగ్రెస్ కు ఇప్పటి నుంచే పతనం మొదలైందా అన్న చర్చ జరుగుతోంది. చూడాలి మరి గుజరాత్ పోరులో విజయం ఎవరిదో ?