జ్ఞానవాపి మసీదు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కొత్త ఇష్యూ. అయోధ్యలో బాబ్రీ మసీదు తర్వాత అంత కన్నా సంచలనంగా మారిన మసీదు. సప్త మోక్షదాయక పట్టణాల్లో ఒకటిగా హిందువులు విశ్వసించే కాశీ మహానగరంలో విశ్వేశ్వరుడి ఆలయానికి ఆనుకుని ఉండే మసీదు. అయోధ్య లో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు నాటి యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మరో రెండు మసీదుల గురించి మాట్లాడారు. వాటిలో ఒకటి ఈ జ్ఞానవాపి. రెండోది మథురలో కృష్ణుడు జన్మించినట్టుగా చెప్పే స్థలంలో ఉన్న షాహీ ఈద్గా మసీదు.
2000 ఏళ్ల క్రితం విక్రమాదిత్యుడు కాశీ విశ్వనాథుడికి ఆలయం కట్టించినట్టు పురాణ ప్రతీతి. 1194లో మహ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్.. కన్నౌజ్ రాజును ఓడించినప్పుడు ఆ ఆలయాన్ని కూల్చివేసినట్టు చెబుతారు. తర్వాత 17 ఏళ్లకు 1211లో గుజరాత్‌కు చెందిన ఒక వ్యాపారి ఆ ఆలయాన్ని పునరుద్ధరించగా.. 1447-1458 మధ్య హుస్సేన్ షా షర్కీ హయాంలో కూల్చివేసినట్టు కొందరు, 1489-1517 మధ్య సికందర్ లోఢీ హయాంలో కూల్చివేసినట్టు మరికొందరు చెబుతారు.
చారిత్రక ఆధారాల ప్రకారం.. అక్బర్ హయాంలో ఆయన సహకారంతో రాజా మాన్‌సింగ్ కాశీలో ఆలయాన్ని పునరుద్ధరించారట. అయితే మాన్‌సింగ్ తన కుమార్తెను ముస్లిం కుటుంబానికి కోడలుగా పంపడంతో బ్రాహ్మణులు ఆ ఆలయాన్ని బహిష్కరించారు. ఆ తర్వాత 1585లో రాజా తోడర్ మల్ అక్బ ర్ సాయంతో ఈ గుడిని నవీకరించినట్టు చెప్తారు. ఔరంగజేబు మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాక 1669 ఏప్రిల్ 4న కాశీ విశ్వనాథుడి గుడిని కూల్చివేసి ఆ ఆలయ గోడల మీదుగా మసీదును నిర్మింపజేశాడట. ఔరంగజేబు సేనలు దండెత్తాయి. ఆలయంతో పాటు గర్భగుడిలోని విశ్వేశ్వరుడి జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేస్తారని... ఆలయ పూజారి ఆ శివలింగాన్ని పెకలించి గుడి ప్రాంగణంలోని జ్ఞానవాపి బావిలో వేసినట్టు ఓ కథనం. శివలింగంతో పాటు పూజారి కూడా బావిలోకి దూకి ప్రాణత్యాగం చేసినట్టు మరికొందరు చెబుతారు.
ఆ బావి పేరు మీదనే ఈ మసీదుకు ‘జ్ఞానవాపి మసీదు’ అని పేరు వచ్చిందట. ఆ మసీదు దక్షిణపు గోడలపై రాతి శిలాతోరణాలు, చెక్కడాలుండటంతో... అక్కడొక ఆలయం ఉండేదని సర్వే సంస్థల అంచనా. ఔరంగజేబు సేనలు ఆ ఆలయాన్ని కూల్చివేసి ఆ స్థలంలో మసీదును కట్టినట్టు సర్వే సంస్థలు తేల్చాయి. 1700లో సవాయ్ జైసింగ్-2 మసీదుకు ముందు 150 గజాల దూరంలో ‘ఆది విశ్వేశ్వరుడి’ ఆలయాన్ని నిర్మించాడు. అప్పుడు కట్టిందే ప్రస్తుత కాశీ విశ్వనాథుడి ఆలయం. కొందరు ముస్లింల ప్రకారం.. అక్కడ ఉన్నది ఆలయం కాదు. అది అక్బర్ స్థాపించిన దీన్-ఇ-ఇలాహీ మతానికి చెందిన కట్టడమని, దాన్నే ఔరంగజేబు కూల్చేశాడని వారు విశ్వసిస్తారు.
ఇకపోతే అయోధ్యలోని బాబ్రీ మసీదు 1991లో పీవీ నరసింహారావు హయాంలో తెచ్చిన ‘ప్రార్థనా స్థలాల చట్టం’ పరిధిలోకి రాదు కాబట్టే అక్కడ రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1947, ఆగస్టు 15 నాటికి దేశంలో ఉన్న మసీదులు, దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలని.. వాటిలో మార్పులు చేయకూడదని నిర్దేశించింది ప్రార్థనా స్థలాల చట్టం. కానీ, ఆ చట్టం చేసే సమయానికే అయోధ్యలో బాబ్రీ మసీదు వివాదంలో ఉండటంతో అది వర్తించలేదు. జ్ఞానవాపి, షాహీ ఈద్గా మసీదుల విషయంలో అలా కుదరదని అప్పట్లో వామపక్ష మేధావులు, చరిత్రకారులు అన్నారు. కానీ ఇప్పుడు జ్ఞానవాపి మసీదు వివాదమూ పెద్దదిగా మారుతోంది.