తెలంగాణలో సర్పంచుల తలరాతలెలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ సర్కారు అధికారంలోకి రాక ముందు సర్పంచులే గ్రామానికి సుప్రీం. అన్ని పవర్స్ ఉండేవి. కానీ కేసీఆర్ కొత్త పంచాయితీ రాజ్ చట్టం తీసుకొచ్చాక సర్పంచుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. మింగలేక కక్కలేక ఉసురు తీసుకుంటున్న వాళ్లు చాలామందే. నిత్యం సర్పంచుల సమస్యలతో మీడియా హోరెత్తుతోంది.
రీసెంట్ గా పల్లెప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశాలు రసాభాసాగా మారుతున్నాయి. బొచ్చ పట్టుకుని అడుక్కోవడం తప్ప వేరే గత్యంతరం లేదనే స్థితికి వాళ్ల పరిస్థితి వచ్చింది. గ్రామాల్లో అభివృద్ధి పనుల పరంగా పల్లె వనం, పారిశుద్ధ్యం, స్మశాన వాటికలు, కొత్త గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణం లాంటి వాటితో విస్తృతంగా చేపట్టింది సర్కారు. గత బడ్జెట్ లో పంచాయితీ రాజ్ శాఖకు అత్యధికంగా 23 వేల కోట్లు కేటాయించింది.
అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే. ఎన్నికలంటేనే ఓట్లు-నోట్లు అన్న సంగతి తెలిసిందే కదా. లక్షలు ఖర్చుపెట్టి గెలిచిన సర్పంచులు, అభివృద్ధి పనుల కోసం కొత్తగా అప్పులు చేయాల్సి వచ్చింది. దాంతో ఇళ్లూ-వాకిళ్లు అమ్ముకుని బిచ్చమెత్తుకుంటున్న పరిస్థితి కొంతమందిది. ఇంకొందరిదేమో కూలీ నాలీ చేస్కుంటే తప్ప కుటుంబం గడిచే పరిస్థితి లేని దుస్థితి. దాంతో సర్పంచులంతా ఏకమై ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. పాత బకాయిలు, బిల్లులు చెల్లిస్తే తప్ప పనులు చేసేది లేదని తెగేసి చెప్తున్నారు. దాంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడితే మొదటికే మోసమొస్తుందని ప్రభుత్వం తేరుకుంది. బిల్లులేవీ పెండింగ్ లో లేవని మంత్రులు కేటీఆర్-హరీష్ రావు లాంటి వాళ్లు కవర్ చేసే ప్రయత్నం చేశారు.
అయితే పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అహంకారం సర్పంచుల ఆగ్రహాన్ని మరింత అగ్గిరాజేసేలా చేసింది. సర్పంచులైతే కూలీ చేసుకుంటే తప్పేంటి ? అన్న ఎర్రబెల్లి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్లు ప్రజాసేవ చేయాలా ? లేక కూలీ పనులు చేసుకోవాలా ? మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి మట్టి పిసుక్కోవచ్చుగా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతో మంత్రి నాలుక కరుచుకున్నట్టు తెలుస్తోంది. సర్పంచుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, కేసీఆర్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఎర్రబెల్లి కామెంట్స్ కాస్ట్ ఎంతో వచ్చే ఎన్నికల్లో తేలనుంది.