పల్లె ప్రగతి సమావేశాలు రచ్చ రచ్చ అవుతున్నాయి. గ్రామాల్లో సర్పంచుల తిరుగుబాట్లు అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నాయి. మంత్రులకు, ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తగులుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్ జిల్లా చెనా రావు పేట మండలం అమృత తండా సర్పంచ్ బోడ వెంకన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సర్పంచులైతేంది ? కూలీ పని చేసుకుంటే తప్పేంది అని కామెంట్ చేసిన మరుసటి రోజే ఇది జరగడం విషాదం.
సర్పంచ్ గా ఎన్నికైన వెంకన్న తన తండాలో సొంత డబ్బుతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. ప్రభుత్వ నిధులపై నమ్మకంతో లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. వడ్డీలకు తీసుకొచ్చి మరీ ఖర్చు పెట్టాడు. బిల్లుల కోసం నెలలుగా ఎదురుచూస్తున్నాడు. ఎంతకీ నిధులు రాక... చేసిన అప్పులపై వడ్డీలు పెరిగిపోయి 15 లక్షలకు చేరిందట. దాంతో ఉన్న భూమి అమ్మేసి అప్పులు తీర్చేందుకు రెడీ అయ్యాడు. అవీ సరిపోలేదు. దాంతో అప్పులిచ్చినోళ్లు ఇంటికొచ్చి ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. తన పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యేకు వివరించి ఆదుకోమని మొరపెట్టుకున్న పని కాలేదు. దాంతో ఆత్మహత్యే శరణ్యమని తనువు చాలించాడు వెంకన్న. సర్పంచ్ మరణంతో అమృత తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఓ వైపు సర్పంచుల తిరుగుబాటుతో తెలంగాణ అట్టుడుకుతున్నా... బిల్లులేవీ పెండింగ్ లో లేవని మంత్రులు చెప్తున్నారు. మరి ఆత్మహత్యలెందుకు జరుగుతున్నయ్. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సర్పంచులారా కదిలిరండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో సర్పంచుల సమరం ఎటు దారితీయనుందో మరి.