(చటాన్ పల్లి బ్రిడ్జీ మీద నుంచి జనం పోలీసులపై చల్లిన పూల వర్షం ఫోటోలు)
2019 డిసెంబర్ 6. దేశం బ్లాక్ డే జరుపుకునే రోజు. పోలీసులంతా మతకల్లోలాలు జరగకుండా కాపు కాసే రోజు. అలాంటి రోజు దేశం ఉలిక్కి పడేలా చేశారు తెలంగాణ పోలీసులు. షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి బ్రిడ్జికి దగ్గర్లో... వెటర్నరీ డాక్టర్ దిశను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, క్రూరంగా కాల్చిపడేసిన అండర్ పాస్ దగ్గర్లోనే నిందితులు ఎన్ కౌంటర్ అయ్యారు. తెల్లవారు జామున నాలుగున్నరకు జరిగిన ఆ ఎన్ కౌంటర్ దావణంలా వ్యాపించింది. హైదరాబాద్-షాద్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. అప్పటి పోలీస్ బాస్ సజ్జనార్ చేసిన సత్వర న్యాయానికి జనం నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పోలీసులపై పూలు జల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. టపాసులు పేల్చారు. స్వీట్లు పంచారు. షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో మరోసారి దీపావళి జరుపుకున్నారు ప్రజలు.
(స్పాట్)
కట్ చేస్తే ఆ ఎన్ కౌంటర్ తర్వాత మరో రేప్ కేసులో ఎరుకలి రాజు అనేటోడు ట్రైన్ కౌంటర్ అయ్యి చచ్చాడు. దాంతో సత్వర న్యాయం అదే ఎన్ కౌంటర్-ట్రైన్ కౌంటర్లపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మానవ హక్కుల సంఘాలు కోర్టుకెక్కాయి. జనం ఎమోషన్ లో చేసే డిమాండ్లకు తగ్గట్టు ఎన్ కౌంటర్లు చేసుకుంటూ పోతే మనుషులెవరు మిగలరు అన్న చర్చ జరిగింది.
ఆ విషయాన్ని పక్కనపెడితే... ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా తెలంగాణ ప్రజల నీరాజనాలందుకున్న సజ్జనార్ పాత్ర ఏమైనట్టు ? సుప్రీంకోర్టులో దిశ ఎన్ కౌంటర్ పై జరిగిన వాదనలు ముగిసిన సందర్భంలో సజ్జనార్ ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు. ఆయన్ని ప్రభుత్వమే తప్పించిందా ? లేక చేతులకు మట్టి అంటకుండా డిపార్ట్ మెంటే ఆయన్ని సైడ్ చేసిందా అన్న చర్చ మొదలైంది. సుమారు 50 సార్లు సజ్జనార్ ని ప్రాసిక్యుట్ చేసింది సిర్పూర్కర్ కమిషన్. మావన హక్కుల కమిషన్ నుంచి విచారణ ఎదుర్కొన్నారు. అయినా సజ్జనార్ పాత్ర బయటకు రాలేదు. దిశది ఫేక్ ఎన్ కౌంటర్ అని తేల్చిన సిర్పూర్కర్ కమిషన్... దానికి ప్రాతినిధ్యం వహించిన సజ్జనార్ కు ఏ రకమైన శిక్ష విధించాలో చర్చించలేదు. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న 10 మంది పోలీసులు, సీనియర్ అధికారులపై మాత్రేమే కేసులు నమోదు చేసి విచారించాలని సిఫార్సు చేసింది. అదే నిజమైతే.. నాటి ఎన్ కౌంటర్ క్రెడిట్ కొట్టేసిన సజ్జనార్ సంగతేంటి మరి ? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. పెద్ద తలకాయల్ని పక్కకు పెట్టి కిందిస్థాయి అధికారులను బలిచ్చారా అన్న చర్చ డిపార్ట్ మెంట్ లో సైతం చర్చ జరుగుతోంది.
2008లో వరంగల్ ఎన్ కౌంటర్ తో సజ్జనార్ పేరు మార్మోగింది. నాడు సజ్జనార్ తో పాటు వైఎస్ ప్రభుత్వానికీ పేరొచ్చింది. 2019 చటాన్ పల్లి ఎన్ కౌంటర్ తో సజ్జనార్ తో పాటు కేసీఆర్ సర్కారుకు ప్రశంసలు దక్కాయి. సమాజ అవసరాలకు తగ్గట్టు న్యాయవ్యవస్థ మారలేనప్పుడు... విఫలమైనప్పుడు... ఎన్ కౌంటర్లే జరుగుతాయి. రైలు పట్టాలపై ఆత్మహత్యలే జరుగుతాయి. న్యాయం అనివార్యంగా తనదైన రీతిలో పక్కదారులు వెతుక్కుంటుందని మరో వర్గం వాదిస్తోంది. అలాంటి వాటికి సజ్జనార్ల లాంటి వాళ్లే కరెక్ట్ అన్న చర్చా షురూ అయింది.
న్యాయస్థానాలు కరెక్ట్ గా పనిచేసి ఉంటే... న్యాయదేవతకు కళ్లకు గంతలే కట్టకపోతే... హాజీపూర్ సైకో శ్రీనివాసరెడ్డి ఉరిశిక్ష ఎందుకు అమలు కాలేదు ? వరంగల్ హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిని అత్యంత కిరాతకంగా చిదిమేసిన ప్రవీణ్ గాడికి ఇంకా ఉరిశిక్ష ఎందుకు అమలు కాలేదు ? లాంటి ప్రశ్నలెన్నో సంధిస్తున్నారు ప్రజలు. అసలు దిశ కేసులో జరిగింది ఫేక్ ఎన్ కౌంటర్ అని తేల్చడానికే మూడేళ్లు పడితే... బాధితులకు న్యాయం జరిగేందుకు కోర్టుల్లో ఎన్నేళ్లు పడుతుందని న్యాయం వైపే అన్ని వేళ్లు చూపిస్తున్నాయి. ఇదో ఎడతెగని చర్చ. మొత్తమ్మీద దిశ ఎన్ కౌంటర్ కేసు విచారణలో సజ్జనార్ సార్ సక్సెస్ ఫుల్ గా సైడయ్యారన్నట్టు.