కూట్లె రాయి తీయనోడు, పంజాబ్ ల పొయ్యి తీస్తడంట
22 May 2022 తెలంగాణ 322

కూట్లె రాయి తీయలేనోడు, ఎట్ల రాయి తీస్తన్నడట. కేసీఆర్ ప్రయోగించిన ప్రయోగమే ఇది. తప్పట్లేదు మరి. అందుకే వాడుతున్నం. తెలంగాణలో సమస్యలను గాలికొదిలేసి.. దేశ దిమ్మరిలా దేశం మొత్తం తిరిగేందుకు కేసీఆర్ బయలెల్లిండు. మొదట పంజాబ్, ఆ తర్వాత బెంగుళూరు, అటెన్క బీహార్, బెంగాల్, యూపీల టూరేస్తడంట. గమ్మతుందిలే. 

 రైతు వ్యతిరేక చట్టాలపై పోరు సాగించి అసువులు బాసిన పంజాబ్ రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేసీఆర్ పంజాబ్ లో అడుగుపెట్టాడు. ఫైన్ బావుంది అనే అనుకుందం. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ పాలనలో ఈ ఎనిమిదేండ్లలో ఆత్మహత్యలు చేసుకున్న 8 వేల మంది రైతు కుటుంబాల ఘోస పట్టదా ? తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమర వీరులకు కేసీఆర్ సర్కారు అందించిన సాయమెంత ? ఇవన్నీ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కూట్లె రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తనన్నడట అని వెక్కిరిస్తున్నరు.

 

ఇకపోతే రాష్ట్రంలో పాలన పడకేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చే దిక్కులేదు. సంక్షేమ పథకాలకు నిధుల్లేవు. పండించిన వడ్లు కొనే దిక్కు లేదు. వానాకాలం సీజన్ మొదలుకాబోతున్నది. రైతుబంధుకు డబ్బుల్లేవు. లక్ష రూపాయల రుణమాఫీ ఎప్పుడు చేస్తరో తెలియదు ? పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు పడి ఉన్నాయి. ఇవి చాలవన్నట్టు పన్నుల బాదుడు. తెలంగాణ ప్రజల రక్తం పీల్చి దేశానికి పంచుతరా ? అన్న ఆక్రోశం తెలంగాణ ప్రజల్లో కనిపిస్తోంది. 

 

తెలంగాణలో నిరసనలు వెల్లువెత్తుతున్నా... పక్క రాష్ట్రాల్లో ప్రజలకు-రైతులకు సాయం చేసేందుకు రెడీ అయిండు కేసీఆర్. ఏం పంజాబ్ లో ప్రభుత్వం లేదా ? అక్కడి రైతులను ఆ సర్కారు ఆదుకోదా ? మానవతా దృక్పథంతో చేసే సాయానికి వెలకట్టలేం. కానీ కేసీఆర్ చేస్తున్న సాయం వెనుక స్వార్థం సంగతేంటి ? ఫ్యామిలీ టూర్ లా కుటుంబాన్ని వెంటేసుకుని వెళ్లిన ఆయన తీరు విమర్శల పాలవుతోంది.

 

దేశ్ కీ నేత అనిపించుకునేందుకు ఏమాత్రం మొహమాట పడకుండా దేశవ్యాప్తంగా యాడ్లిస్తున్నది టీఆర్ఎస్. అన్ని ప్రాంతీయ భాషల్లో తెలంగాణ మోడల్ డెవలప్ మెంట్ ను డాక్యుమెంటరీల రూపంలో వదులుతున్నరు. దాని కోసం వేల కోట్లు ఖర్చుపెడుతోంది గులాబీ పార్టీ. తెలంగాణలో వెయ్యి కోట్ల ఖరీదైన పార్టీ కదా. పార్టీ ప్రచారం కోసం పెట్టుకుంటరనే అనుకుందం. కానీ జనం డబ్బును ఇలా అప్పనంగా పప్పు బెల్లాల్లా పంచడమేందని ప్రశ్నిస్తున్నరు తెలంగాణ ప్రజలు. దీనికి గులాబీ బాస్ ఏం సమాధానం చెబుతారు ?

అసలు బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్... రాష్రంలో పాలనను పట్టించుకుంటున్నారా ? పంజాబ్ టూర్ కు ముందు రెండు వారాల పాటు పబ్లిక్ లో కనిపించలేదు ? ఎందుకు ? అడిగేవాళ్లు లేరనా ? ఏం చేసినా తెలంగాణ ప్రజలు ఎడ్డొళ్లులే ? ఏం ప్రశ్నిస్తరనా ? శ్రీలంకలో పాలకులపై తిరగబడినట్టు తెలంగాణలోనూ కల్వకుంట్ల కుటుంబ పాలనపై తిరుగుబాటు చేస్తే తప్ప దొరకు బుద్ధి రాదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నై. 

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV