రాహుల్ వీడియో, సోషల్ మీడియాలో రచ్చ
05 May 2022 జాతీయం 328

పాలిటిక్స్ లో బురద జల్లడం చాలా ఈజీ. దాన్ని కడుక్కోవడమే చాలా కష్టం. కాంగ్రెస్ యువనేత రాహుల్ పై ఆ ప్రభావం మరీ ఎక్కువ. రెండుసార్లు యూపీఏ అధికారంలోకొచ్చినా.. తన దాకా వచ్చిన ప్రధాని పదవిని కాలితో తన్నేశాడు పాపం. లేదంటే మాజీ ప్రధాని హోదాలోనైనా రాహుల్ కు అంత డ్యామేజ్ జరిగేది కాదేమో. 

 

అసలు విషయానికొస్తే... నిన్నంతా సోషల్ మీడియాలో రాహుల్ వీడియో హోరెత్తింది. ఓ పబ్ లో ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ యువరాజు వీడియో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో వైరల్ గా మారింది. చైనా రాయబారితో కలిసి చిందులేస్తున్నాడని ఆ వీడియో సారాంశం. ఓ బీజేపీ నేత లీక్ చేసిన ఆ వీడియోపై పెను దుమారం రేగింది. ప్రధాని మోడీ విదేశాల్లో తిరుగుతున్న వీడియోలతో కాంగ్రెస్ హోరెత్తించింది. ఓ వైపు దేశం సంక్షోభంలో ఉంటే... సాహెబ్ విదేశాల్లో ఉండేందుకు ఇష్టపడుతున్నారని మోడీపై కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో విమర్శలు చేసింది. దానికి కౌంటర్ గా బీజేపీ... రాహుల్ వీడియో వదిలినట్టు తెలుస్తోంది.

 

 

అసలే రాహుల్ కు కాలం కలిసిరాక సతమతమవుతుంటే.. ఈ వీడియోల గోల ఎంటా అని కాంగ్రెస్ కౌంటర్లివ్వడం మొదలుపెట్టింది. నేపాల్లో ఓ మిత్రుడి పెళ్లికి వెళ్లి ఎంజాయ్ చేస్తే తప్పేంటని కౌంటరిచ్చింది. దాంతో డిఫెండ్ చేసుకోవడం పువ్వు పార్టీ వంతైంది. రాహుల్ ని టార్గెట్ చేయబోతే బీజేపీకి రివర్స్ కొట్టినట్టైంది.

 

 

2014లో మోడీ ప్రధాని అయ్యాక రాహుల్ గాంధీని పప్పును చేసేందుకు బీజేపీ కొన్ని వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతారు. అక్కడితో ఆపితే బావుండేదేమో. చచ్చిన పామును మరింత కొట్టి కొట్టి చంపాలన్న బీజేపీ తాపత్రయం ఆ పార్టీ పరువు తీస్తోంది. ఓ వైపు మోడీ వైఫల్యాలపై చర్చ జరగకుండా ప్రతీ దానికీ కాంగ్రెస్ ను, నెహ్రూను, ఇందిరా గాంధీని, మొత్తం గాంధీ ఫ్యామిలీని ఆడిపోసుకోవడం బీజేపీకి ప్యాషన్ అయిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 

దీనికితోడు రాహుల్ హుందాతనం జనంలో సానుభూతిని పెంచింది. అతి సర్వత్ర వర్జేయత్ అన్నట్టు... రాహుల్ ని విపరీతంగా హేళన చేస్తుండటంతో బీజేపీ ప్రచారంపై వెగటు పుట్టించింది. రాహుల్ ని సమర్థిస్తూ కొందరు తటస్థులు డిఫెండ్ చేయడం కనిపించింది. నిజానికి పార్ట్ టైం పాలిటిక్స్ తో ఈ స్థితికి చేరడానికి రాహుల్ సెల్ఫ్ గోల్స్ కూడా ఓ కారణమంటారు. ఎనిమిదేండ్లుగా విజయానికి మొహం వాచిపోయిన కాంగ్రెస్ కు రాహులే ఐరన్ లెగ్ అన్న ముద్రపడిపోయింది. బీజేపీ లాంటి... మోడీ-షా లాంటి నేతలను ఎదుర్కొనాలంటే ఈ ఎఫర్ట్స్ సరిపోవన్న విశ్లేషణలున్నాయి. సీరియస్ గా రాజకీయాలు చేస్తే తప్ప కాంగ్రెస్ రేసులోకి రావడం కష్టమే అని తేల్చేశారు పొలిటికల్ అనలిస్టులు. అయినా సరే రాహుల్ వైఖరిలో మార్పు రాలేదు. పార్టీ గాంధీ ఫ్యామిలీ నుంచి చేజారుతున్నా ఇంకా సీరియస్ నెస్ లేకపోవడం ఇదిగో ఇలా అభాసుపాలవుతుంటాడు రాహుల్. పబ్బుల చుట్టూ, క్లబ్బుల చుట్టూ తిరగడం రాహుల్ ని మరింత పలుచన చేస్తోంది. చూడాలి మరి రాహుల్ ఈ వ్యతిరేక ప్రచారం నుంచి ఎలా బయటపడతాడో. 

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV