జూబ్లీహిల్స్ రేప్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నిందితులను పోలీసులు రక్షిస్తున్న తీరు, వెనకేసుకొస్తున్న విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో... రిమాండ్ రిపోర్ట్ ను పకడ్బందీగా తయారు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దానికోసం సీన్ రీ కన్ స్ట్రక్షన్ కూడా చేశారు. రిమాండ్ తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలించాక.. బిర్యానీ తినేందుకు అనుమతించడం మరింత వివాదస్పదమైంది. బంధువుల అభ్యర్థన మేరకు స్టార్ హోటల్స్ నుంచి బిర్యాని తెప్పించి తినిపించడం పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇకపోతే జూబ్లీహిల్స్ రేప్ కేసులో పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురు నిందితుల్లో నలుగురు మైనర్లు. ఆ నలుగురిని జువెనైల్ స్టేట్ హోంకు తరలించిన సంగతి తెలిసింది. అయితే జువెనైల్ హోంలో నిందితులు నలుగురు తన్నుకున్న విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. అర్థరాత్రి... స్టేట్ హోంలో నిందితులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం నువ్వంటే నువ్వని ఒకరినొకరు తిట్టుకుంటూ తన్నుకున్నారట. బాధితురాలిని ట్రాప్ చేసింది కార్పొరేటర్ కొడుకేనని.. అతని టార్గెట్ గా మిగిలిన ముగ్గురు దాడికి దిగారట. కార్పొరేటర్ కొడుకు తిరగబడటంతో పోలీసులు జోక్యం చేసుకుని నిందితులను సముదాయించారట.
ఇక ఈ కేసులో ఏ-1 నిందితుడైన సాదుద్దీన్ మాలిక్ కు 14 రోజుల రిమాండ్ ముగియడంతో... అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. మొత్తమ్మీద ఈ కేసులో నిందితులకు శిక్షల కోసం జనం నుంచి తీవ్రమైన రియాక్షన్ వస్తోంది. కానీ పోలీసుల తీరే వివాదస్పదంగా మారింది. బెంజు కారుకో న్యాయం, లారీకో న్యాయమా అని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. చూడాలి మరి ఈ కేసుకు పోలీసులు ఎలాంటి ముగింపునిస్తారో.