కమలంతో అమరీందర్ సింగ్ దోస్తీ
ఇటీవలనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ సినీయర్ నేతలతో సమావేశమైన అమరీందర్ ఉమ్మడి పోటీపై స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అమరీందర్ పంజాడ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటు తర్వాత అమిత్ షా, జేపీ నడ్డాలతో పలు చర్చలు కూడా జరిపారు.
బీజేపీతో పొత్తు ప్రయత్నాల్లో భాగంగా కెప్టెన్ సింగ్ శుక్రవారం కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు సీట్ల సర్ధుబాటును చేపడతాయని చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 101 శాతం తాము విజయం సాధిస్తామని కెప్టెన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఏడు దశల చర్చల అనంతరం బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని తాను ప్రకటిస్తున్నానని పంజాబ్ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ షెకావత్ వెల్లడించారు. సీట్ల సర్ధుబాటు వంటి అంశాలపై తర్వాత చర్చలు జరుపుతామని తెలిపారు.
త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళల్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒంటరిగా పోటీలో దిగుతుండగా, బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయనున్నాయి.