మానవ మనుగడపై ఒమిక్రాన్ వేరియంట్ దాడి
ప్రపంచ దేశాలపై ఒమిక్రాన్ వేరియంట్ పడగ
పలు దేశాల్లో స్పీడ్ గా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్
కరోనా కఠిన నిబంధనలతోనే ఒమిక్రాన్ కట్టడి
ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అత్యంత వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నాయి కరోనా మహమ్మారి నుంచి ఇప్పడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచదేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ ఒక సవాల్ గా మారింది. ఒమిక్రాన్ వేరియంట్ 63 దేశాల్లో వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కరోనా రెండ దశలో విధ్వంసం సృష్టించిన డెల్టా వేరియంట్ను ఇది త్వరలోనే అధిగమించవచ్చని అంచనా వేసింది. కొత్త వేరియంట్ ఇంత వేగంగా ఎందుకు వ్యాప్తి చెందుతుందో ఇంకా తెలియదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం డెల్టా కంటే ఈ వేరియంట్ తక్కువ ప్రమాదకారి అని అభిప్రాయపడింది. ఒమిక్రాన్పై వ్యాక్సిన్ల పనితీరుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులతోపాటు మరణాలు కూడా నమోదవుతున్నాయి. బ్రిటన్ లో ఒమిక్రాన్ తొలిమరణం సంభవించగా.. చైనా, పాకిస్థాన్ దేశాల్లో తొలి ఒమిక్రాన్ కేసులు రికార్డు అయ్యాయి. ఇక భారత్ లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు దేశంలో 40 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 20 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు 10 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు తెలిపింది.
అప్రమత్తతోనే ఒమిక్రాన్ కు అడ్డుకట్ట
ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించిన ఈ వైరస్.. ప్రజలపై ఏ రకంగా ప్రభావం చూపుతుందనే అంశంపై ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి ఒమిక్రాన్ చాలా ప్రాణాంతకం కానప్పటికీ, దాని సంక్రమణ రేటు యొక్క తీవ్రతను తోసిపుచ్చలేమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ చాలా వేగంగా ఇతరులకు సోకుతుందని నిపుణులు భావిస్తున్నారు. డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుందనడానికి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినప్పటికీ, ఇది ఆందోళన కలిగించే విషయం. ఒమిక్రాన్ లక్షణాల గురించి స్పష్టమైన సూచనలు లేనప్పటికీ, ఈ కొత్త వేరియంట్ సోకిన వ్యక్తులలో అనుభవించిన సమస్యల ఆధారంగా దాని లక్షణాలు కొన్ని డెల్టా వైరస్ నుండి భిన్నంగా కనిపిస్తున్నాయి. అయితే కరోనా వైరస్ వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నారో..అవే నిబంధనలను కఠినంగా పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ ధరించడంతోపాటు భౌతికదూరాన్ని పాటించాలని ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
pic: CNBC
ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన కృషి చేయాల్సి ఉంది. అంతర్జాతీయ విమానసర్వీసులపై ఆంక్షలు విధించిన కేంద్రం..రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఒమిక్రాన్ ను ఎదుర్కొంనేందుకు రాష్ట్రాలు కార్యాచరణను రూపొందించుకొని, ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఒమిక్రాన్ వ్యాప్తి నియంత్రణకు దోహదపడుతుంది. వైద్యరంగంలో మౌలిక సదుపాయాలతోపాటు ప్రభుత్వ ఆస్పత్రులను మరింత బలోపేతం చేయాల్సి ఉంది. ప్రభుత్వం సహకారం, ప్రజల భాగస్వామ్యంలో ఎలాంటి మహమ్మారినైనా ఎదిరించవచ్చు.